ఫ్లాప్ సినిమా తీసినందుకు యాక్టింగ్ చేశాడట

పెద్ద బడ్జెట్లో తీసిన సినిమాలు డిజాస్టర్లు అయితే.. హీరో, డైరెక్టర్ తమ పారితోషకాల నుంచి కొంత వెనక్కి ఇవ్వడం కొత్తేమీ కాదు. కొన్నిసార్లు దర్శకులు మొత్తం పారితోషకాలను వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ‘ఆచార్య’ సినిమా విషయంలో అయితే కొరటాల శివ పారితోషకం అంతా కోల్పోవడమే కాదు.. బయ్యర్ల నష్టాలను భర్తీ చేయడం కోసం సొంత డబ్బులు కూడా పెట్టుకోవల్సిన పరిస్థితి తలెత్తింది.

ప్రొడక్షన్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవడం వల్ల కొరటాలకు ఈ కష్టం తప్పలేదు. బాలీవుడ్ విలక్షణ దర్శకుల్లో ఒకడైన అనురాగ్ కశ్యప్ కూడా ఒక సినిమా విషయంలో ఇలాంటి కష్టమే ఎదుర్కొన్నాడట. కాకపోతే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో అందుకు బదులుగా ఆ సినిమాను నిర్మించిన సంస్థ తీసిన వేరే సినిమాలో నటుడిగా చేయాల్సి వచ్చిందట. అనురాగ్‌ను అంత కష్టపెట్టిన చిత్రం.. బాంబే వెల్వెట్.

2015లో వచ్చిన ‘బాంబే వెల్వెట్’ బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్లో ఫాంటమ్ ఫిలిమ్స్ సంస్థతో కలిసి ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  ఐతే బడ్జెట్లో సగం కూడా ఈ చిత్రం వసూలు చేయలేకపోయింది. దీంతో అనురాగ్ కశ్యప్ నిర్మాణ సంస్థకు నష్టపరిహారం కింద ఫాక్స్ స్టార్ వాళ్లకు ఎదురు డబ్బులు కట్టాల్సి వచ్చిందట.

ఇందుకోసమే ఫాక్స్ స్టార్ వాళ్లు ప్రొడ్యూస్ చేసిన ‘అకీరా’ సినిమాలో తాను నటుడి అవతారం ఎత్తాల్సి వచ్చిందని.. అందులో ఉచితంగా నటించానని అనురాగ్ తెలిపాడు. ఈ సినిమాలో తన పాత్ర క్లిక్ కావడంతో తర్వాత తనకు నటుడిగా బోలెడన్ని అవకాశాలు వచ్చాయని అనురాగ్ తెలిపాడు. ప్రస్తుతం అనురాగ్ దర్శకుడిగా సినిమాలు తీస్తూనే.. నటుడిగా కూడా బిజీగా ఉన్నాడు. తమిళంలో విజయ్ సేతుపతి కొత్త సినిమాలోనూ అతను నటిస్తున్నాడు.