డైలాగ్ డెలివరీ తేడా కొట్టింది చిరూ..

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ టీజర్ నిన్ననే అభిమానుల కోలాహలం మధ్య రిలీజైంది. ఆ టీజర్ విషయంలో ప్రేక్షకుల నుంచి నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు మంచి మాస్ సినిమా చూడబోతున్నామని.. అభిమానులకు ఈ మాత్రం చాలు అని అంటే.. మిగతా వాళ్లంత ఏముంది ఇందులో వైవిధ్యం అంటూ నిరాశచెందారు.

టీజర్లో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు. ప్రతి షాట్ ఎక్కడో చూసినట్లే కనిపించగా.. డైలాగులు కూడా చాలా మొనాటనస్‌గా అనిపించాయి. సగటు మాస్ సినిమా ఫార్మాట్‌ను ఫాలో అయిన సినిమాలాగే కనిపించింది ‘భోళా శంకర్’. ఇక టీజర్ రిలీజయ్యాక ఎక్కువమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది ఇందులో చిరు పలికిన డైలాగుల గురించే. డైలాగులు చాలా రొటీన్‌గా ఉండటం ఒక కంప్లైంట్ అయితే.. చిరు తెలంగాణ స్లాంగ్‌లో విచిత్రమైన డైలాగ్ డెలివరీతో సంభాషణలు పలకడం మీద ట్రోలింగ్ తప్పలేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలుగు సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ వాడకం బాగా పెరిగింది. ఇక్కడి నేటివిటీతో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. అలాగే స్టార్ హీరోలు సైతం ఈ స్లాంగ్‌లో డైలాగులు చెబుతున్నారు. ‘భగవంత్ కేసరి’లో నందమూరి బాలకృష్ణకు సైతం ఈ స్లాంగే పెట్టారు. కానీ బాలయ్య ఆ యాసలో డైలాగులు చెబుతుంటే ఓకే అనిపించింది కానీ.. చిరుకు మాత్రం ఆ స్లాంగ్ సెట్ కాలేదనే అనిపిస్తోంది. చిరు డైలాగ్ డెలివరీలో నేచురల్ ఫ్లో కనిపించలేదు.

ఏదో సాగదీసి పలుకుతున్నట్లు అనిపించాయి సంభాషణలు. చిరు అభిమానులు సైతం ఆయనకీ స్లాంగ్.. డైలాగ్ డెలివరీ సెట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. మెహర్ రమేష్ మామూలు స్లాంగ్‌తోనో లేదంటే చిరుకు సెట్టయ్యే ఉత్తరాంధ్ర యాసతోనో ఆ క్యారెక్టర్‌ను లాగించేయాల్సిందని.. అనవసరంగా తెలంగాణ స్లాంగ్ పెట్టి చిరుతో పాటు అభిమానులనూ ఇబ్బంది పెట్టాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.