పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో ఆసక్తికర ప్రసంగాలతో, వ్యాఖ్యలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. సోషల్ మీడియాలో తన అభిమానులు ఫ్యాన్ వార్స్ కట్టి పెట్టి అందరితోనూ కలుపుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇటీవలే వారాహి యాత్రలో పవన్ మాట్లాడుత మహేష్, ఎన్టీఆర్, రవితేజ, చిరంజీవి, రామ్ చరణ్.. ఇలా పలువురు హీరోల పేర్లు ప్రస్తావించి.. తామందరం కలిస్తేనే సినీ పరిశ్రమ అని.. అందరూ తనకు ఇష్టమని.. అందరు హీరోల అభిమానులూ జనసేనను ఆదరించాలని పవన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ యాత్రలో పవన్.. తన తోటి హీరోల గురించి మరింత ఆసక్తి రేకెత్తించే కామెంట్స్ చేశాడు. మహేష్ బాబు, ప్రభాస్ తనకంటే పెద్ద హీరోలని పవన్ వ్యాఖ్యానించడం విశేషం.
మహేష్ గారు, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియకపోవచ్చు, కానీ వారు తెలుసు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఈగో లేదు. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండి అని పవన్ పిలుపునిచ్చాడు.
ఒక సినీ నటుడు రాజకీయాల్లోకి వచ్చాక అందరినీ కలుపుకు పోవాల్సి ఉంటుంది. కానీ పవన్ ఫ్యాన్స్ ఈ విషయం అర్థం చేసుకోకుండా అదే పనిగా వేరే హీరోలను టార్గెట్ చేయడం.. కించపరిచేలా పోస్టులు పెట్టడం.. వాళ్లను రెచ్చగొట్టి పవన్ పట్ల, జనసేన పట్ల వ్యతిరేకత పెంచేలా చేయడం లాంటి చర్యలతో ఎప్పట్నుంచో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ మళ్లీ మళ్లీ ఇతర హీరోల గురించి ఇలా వ్యాఖ్యానిస్తున్నట్లు అర్థమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates