శుక్రవారం ‘ఆదిపురుష్’ అర్లీ మార్నింగ్ షోలు పూర్తయ్యాయో లేదో ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోయింది. ముఖ్యంగా ముఖ్య పాత్రధారుల లుక్స్ విషయమై తీవ్ర వ్యతిరేకత కనిపించింది సామాజిక మాధ్యమాల్లో. రావణుడి పాత్ర లుక్స్‌తో పాటు ఆ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన విధానం పెద్ద చర్చకే దారితీసింది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ మీదా విమర్శలు తప్పలేదు.
ఇవన్నీ ఒకెత్తయితే.. హనుమంతుడి పాత్రతో చెప్పించిన ఒక డైలాగ్ వివాదానికి దారి తీసింది. దాని మీద రాజకీయ పార్టీల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ డైలాగ్ విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘ఆదిపురుష్’ హద్దులు దాటి వ్యవహరించిందని.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంతకీ వివాదానికి దారి తీసిన ఆ డైలాగ్ సంగతి చూద్దాం పదండి.
‘ఆదిపురుష్’లో లంకలో ఉన్న సీతమ్మను చూసేందుకు వచ్చినపుడు హనుమంతుడి తోకకు రావణుడి కొడుకు ఇంద్రజీత్ నిప్పంటించి.. ‘‘కాలుతోందా’’ అంటాడు. దానికి హనుమంతుడు బదులిస్తూ.. ‘‘గుడ్డ నీ బాబుది. నూనె నీ బాబుది. మంట నీ బాబుది. కాలేది కూడా నీ బాబుదే’’ అని బదులిస్తాడు.
ఇందులో బూతులేమీ లేకపోవచ్చు కానీ.. ‘రామాయణం’ మీద తీసిన సినిమాలో.. హనుమంతుడితో ఇలాంటి స్థాయి తక్కువ భాష మాట్లాడించడం ఏంటనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద సోషల్ మీడియా జనాలు ఆల్రెడీ విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఈ డైలాగ్‌ను తప్పుబడుతుండటంతో వివాదానికి దారితీసింది. మరి ఈ డైలాగ్ విషయమై దర్శకుడు ఓం రౌత్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి. ఐతే ఈ డైలాగ్‌ను పక్కన పెడితే సినిమాలో హనుమంతుడి పాత్ర బాగానే ఉంది.