పాపం ఫ్లాష్… పిచ్చ లైట్ తీసుకున్నారు

ఒకే టైంలో విడుదల ఉండటం వల్ల హాలీవుడ్ మూవీ ది ఫ్లాష్ వల్ల ఆదిపురుష్ కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందేమోనని భయపడిన ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. ఎందుకంటే సూపర్ హీరోల కలయికలో మంచి కంటెంట్ తో రూపొందినప్పటికీ ఫ్లాష్ మీద తెలుగు ఆడియన్స్ ఏమంత ఆసక్తి చూపించడం లేదు. పైగా ప్రభాస్ సినిమా మొదటి రోజే చూడాలని ఫిక్సైపోయి టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నా సరే ఫ్యామిలీతో సహా బుక్ చేసుకుంటున్న వాళ్ళు అధికంగా ఉన్నారు. దీంతో హైదరాబాద్ తో సహా ఏపీ తెలంగాణలో ఫ్లాష్ రెస్పాన్స్ భారీ స్థాయిలో కనిపించడం లేదు.

నార్త్ లోనూ ఈ రోజు తప్ప రేపటికి ఫ్లాష్ ప్రతాపం పెద్దగా ఏముండదు. ఐమాక్స్ స్క్రీన్లు తగినన్ని దొరికినా సరే ఊహించినంత డిమాండ్ కనిపించడం లేదని బయ్యర్ల మాట. ఒకవేళ మాములు పరిస్థితుల్లో ఎలాంటి కాంపిటీషన్ లేకుండా ఫ్లాష్ కనక వచ్చి ఉంటే ప్రసాద్స్ పీసీఎక్స్ లాంటి స్క్రీన్లు కిటకిటలాడేవి. కానీ అది జరగలేదు. ఎలాగూ రేపు ఆదిపురుష్ చూడాలనే ఉద్దేశంతో ఫ్లాష్ కి బడ్జెట్ కేటాయించలేకపోయిన సగటు మూవీ లవర్స్ ఫైనల్ గా ఇంగ్లీష్ బొమ్మకు హ్యాండ్ ఇచ్చారు. రేపటి నుంచి ది ఫ్లాష్ కిచ్చిన స్క్రీన్ కౌంట్ భారీ స్థాయిలో తగ్గబోతోంది

ఓవర్సీస్ లో పరిస్థితి ఇంత తీవ్రంగా లేదు కానీ ఆదిపురుష్ బుకింగ్స్ ఉత్సాపరిచేలానే ఉన్నాయి. త్రీడి తెరలు ఎక్కువ ఫ్లాష్ కి ఇవ్వడంతో మొదటివారం ఇబ్బందులు తప్పవు. ఇండియాలో ఆ సమస్య లేదు. ఇదంతా ఎలా ఉన్నా ఫ్లాష్ లో విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న త్రీడి థియేటర్ లో చూస్తే అదిరిపోతోంది కానీ ప్యాన్ ఇండియా ప్రభాస్ ముందు సూపర్ హీరోలు కలిసి వచ్చినా లాభం లేకపోయింది. ఉత్తరాది రాష్ట్రాల పుణ్యమాని యాభై వేలకి పైగా మొదటి రోజు టికెట్లు అమ్మిన ఫ్లాష్ కి రేపటి నుంచి పదివేల లోపే పడిపోవడం ఖాయంగా కనిస్తోంది