ప్రస్తుతం ఇండియా అంతా ఆసక్తి ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప-2’ ఒకటి. ఫస్ట్ పార్ట్‌లో విలన్ పాత్ర చేసిన ఫాహద్ ఫాజిలే ఇందులోనూ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆయన కాకుండా జగపతిబాబు కొత్తగా సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్, మిగతా నటీనటులు ఎలాగూ ఇందులోనూ కొనసాగుతారు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి కూడా నటిస్తున్నట్లుగా ఒక ప్రచారం నడుస్తోంది.
తాను ముఖ్య పాత్ర పోషించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చి విలేకరులతో మాట్లాడిన మనోజ్.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాను ఈ చిత్రంలో నటించట్లేదని మనోజ్ స్పష్టం చేశాడు. తెలుగులో ఏవైనా సినిమాలు చేస్తున్నారా.. ఎవరితో అయినా నటించాలని ఆశపడుతున్నారా అని అడిగితే.. తాను తెలుగులో అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు (హ్యాపీ, వేదం), పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా (కొమరం పులి) చేశానని.. ఇక్కడి హీరోలందరూ మంచి నటులని.. వాళ్లెవ్వరితో నటించడానికి అయినా తాను సిద్ధమని మనోజ్ తెలిపాడు.
ఇక ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రంలో తన బదులు ఏ తెలుగు నటుడు నటిస్తే బాగుంటుందనే ప్రశ్నకు మనోజ్ సమాధానం ఇస్తూ.. ‘‘సోలంకి పాత్రకు ఇక్కడ ఏ హీరో అయినా సూటవుతాడు. అందరూ మంచి ఆర్టిస్టులే. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ‘వకీల్ సాబ్’లో ఇలాంటి పాత్రే చేశాడు. అతను కాకుండా మహేష్ బాబు అయితే నా పాత్రకు బాగుంటుందని అనుకుంటున్నా. మహేష్ బాగా చేయగలడు. ఆ పాత్రకు కూడా సూటవుతాడు’’ అని చెప్పాడు.
ఇక ఓటీటీకి సెన్సార్ ఉండాలన్న ప్రతిపాదనను మనోజ్ తిరస్కరించాడు. అలా చేస్తే ఓటీటీ చచ్చిపోతుందని చెప్పాడు. ఇక్కడ ఎవరు ఏదైనా తీయగలిగే స్వేచ్ఛ ఉందని.. అదే సమయంలో ఇప్పుడు అందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారని.. ఇందులో ఏం చూడాలి అనే సెన్సార్ షిప్ జనాలే చేసుకోవాలని మనోజ్ అభిప్రాయపడ్డాడు.