టాలీవుడ్లో చాలా ముందుగా బెర్తులు బుక్ అయిపోయే సీజన్ అంటే సంక్రాంతే. ఆ సీజన్లో సినిమాలు చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు, అప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు వసూళ్ల మోత మోగిపోతుంది కాబట్టి.. దానికి అంత క్రేజ్. ఐదారు నెలల ముందే దాదాపుగా సంక్రాంతి బెర్తులన్నీ ఫిల్ అయిపోతుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌కు కూడా గట్టి పోటీనే ఉండేలా ఉంది. కాకపోతే ఆ పండక్కి పక్కాగా వచ్చే సినిమాలు ఏవి అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.
ముందు ఈ సీజన్‌కు ఖరారైన సినిమా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే. ఆ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల గుంటూరు కారంను అదే పండక్కి షెడ్యూల్ చేశారు. కానీ ప్రాజెక్ట్ కే అనుకున్న ప్రకారం రిలీజ్ కాకపోవచ్చని.. వేసవికి వాయిదా పడొచ్చని అంటున్నారు. అందుకేనేమో కొత్తగా సంక్రాంతి రేసులోకి వేరే సినిమాలు వస్తున్నట్లున్నాయి. తాజాగా మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఈగల్‌ను 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభాస్‌తో చాలా క్లోజ్‌గా ఉంటున్న పీపుల్స్ మీడియా అధినేతలు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇది.
ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రాదనే సమాచారంతోనే వాళ్లు ఈగల్‌ను పండక్కి షెడ్యూల్ చేసినట్లున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీల్లో ఒకదాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. పవన్ సినిమా ఒకటి ఖరారైతే.. మహేష్ మూవీ కూడా పండక్కి పక్కాగా వచ్చేట్లయితే సంక్రాంతి బెర్తులు ఫుల్ అయిపోయినట్లే. ఇంకో సినిమాకు అవకాశం లేకపోవచ్చు. ఐతే తమిళ సినిమా ఇండియన్-2 డబ్బింగ్ వెర్షన్ కూడా సంక్రాంతికే వచ్చే అవకాశాలున్నాయి.