లాజిక్ మిస్సవుతున్న డాడీ హీరో  

షాహిద్ కపూర్ కొత్త సినిమా బ్లడీ డాడీ జియో సినిమాలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకుంది. స్ట్రీమింగ్ అర్ధరాత్రి నుంచే మొదలైపోయింది. రిపోర్ట్స్, రివ్యూలు డివైడ్ గానే ఉన్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో షాహిద్ చాలా వయొలెంట్ షేడ్స్ లో కనిపించాడు. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్స్ లో సౌత్ ఆడియన్స్ మీద చేసిన కామెంట్స్ నెటిజెన్ల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాది ప్రేక్షకులు కెజిఎఫ్, కాంతార, ఆర్ఆర్ఆర్ లను భాషతో సంబంధం లేకుండా ఆదరించినట్టు బాలీవుడ్ మూవీస్ ని కూడా తమిళ తెలుగు జనాలు చూడాలని పిలుపునిచ్చాడు.

చెప్పడం వరకైతే బాగానే ఉంది కానీ షాహిద్ చాలా పెద్ద లాజిక్ మిసయ్యాడు. హిందీ చిత్రాలకు ఏపీ తెలంగాణలో గొప్ప ట్రాక్ రికార్డు ఉంది. మైనే ప్యార్ కియా, హం ఆప్కె హై కౌన్, డిడిఎల్ లు సిల్వర్ జూబ్లీలు జరుపుకున్నాయి. ముఖ్యంగా 90 దశకంలో స్వర్ణ యుగం నడిచింది. షోలే, డాన్, ఖుర్బాని లాంటివి ఎన్ని రీ రిలీజులు జరుపుకున్నాయో లెక్క లేదు. కరణ్ జోహార్, యష్ చోప్రా, అనురాగ్ కశ్యప్ లాంటి మేకర్స్ కి ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉంది. పాతవి ఎందుకనుకుంటే పఠాన్ కి భారీ వసూళ్లు వచ్చిన నగరాల్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలున్నాయి.

ఇదంతా మర్చిపోయి ఇక్కడి జనాలు హిందీ సినిమాలు చూడటం లేదని వాపోవడంలో అర్థం లేదు. ఆ మాటకొస్తే స్క్రాప్ కంటెంట్ ని చూడలేక స్వంత ఆడియన్సే థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. 2023లో ఇప్పటిదాకా అక్కడ నమోదైన బ్లాక్ బస్టర్ పఠాన్ ఒకటే. తూ జూఠీ మై మక్కర్ సూపర్ హిట్ కాగా జర హట్కె జర బచ్కె పర్వాలేదనిపించుకుంది. మిగిలినవన్నీ టపా కట్టినవే. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్లకు ఓపెనింగ్స్ రావడం లేదంటే తప్పెవరిది. ఇదంతా ప్రాక్టికల్ గా ఆలోచించకుండా సింపుల్ గా స్టేట్ మెంట్ ఇస్తే ఎలా డాడీ  అని  నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. పాయింటే మరి