ఒకప్పుడు ఎవరైనా హీరోకు సంబంధించి, సినిమాకు సంబంధించి ఏదైనా హ్యాష్ ట్యాగ్ మీద మిలియన్ ట్వీట్లు పడితే వావ్ అనేవాళ్లు. ఆ హీరోకు అంతమంది అభిమానులున్నారా.. ఒక్కొక్కరు ఎన్ని ట్వీట్లు వేస్తారు.. ఇంతమంది మూకుమ్మడిగా ట్రెండ్‌లో ఎలా పాల్గొంటున్నారు.. వీళ్లను మొబిలైజ్ చేసేదెవరు.. అన్న సందేహాలు కలిగేవి. కానీ ఇప్పుడు పదుల మిలియన్లలో ట్వీట్లు పడిపోతున్నాయి.
అది కూడా ఒక్క రోజు వ్యవధిలో. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోకు అడ్వాన్స్ విషెస్ చెబుతూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తే 24 గంటల వ్యవధిలో 28 మిలియన్లకు పైగా ట్వీట్లు పడ్డాయి. అప్పటికి అది రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా డబుల్ నంబర్ ట్వీట్లతో బద్దలు కొట్టారు.
24 గంటల వ్యవధిలో #hbdmaheshbabu హ్యాష్ ట్యాగ్ మీద ఏకంగా 60 మిలియన్లు.. అంటే 6 కోట్ల ట్వీట్లు వేశారు మహేష్ ఫ్యాన్స్. ఇది ప్రపంచ రికార్డట. ఇంత వరకు ప్రపంచంలో ఎవ్వరూ ఒక్క రోజు వ్యవధిలో ఒక హ్యాష్ ట్యాగ్ మీద ఇన్ని ట్వీట్లు వేయలేదట. నిన్న అత్యంత వేగంగా 10 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఓవరాల్ రికార్డును కూడా బద్దలు కొట్టేశారు.
ఈ ట్రెండ్‌లో మొత్తం 1.28 లక్షల మంది పాల్గొన్నట్లు కూడా మహేష్ పీఆర్ టీం ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే ఒక్కో వ్యక్తి సగటున 500 దాకా ట్వీట్లు వేశాడన్నమాట. అంటే రికార్డు కోసం అభిమానులు ఎలా పనిగట్టుకుని ట్వీట్లు వేస్తున్నారో.. దీన్ని ఎలా ఓ యజ్ఞంలా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ఆగస్టు 22న చిరు పుట్టిన రోజుకు, సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకు మెగా అభిమానులు ఎలాంటి రికార్డులు నెలకొల్పుతారో చూడాలి.