అట్టడుగు స్థాయికి దిగజారిన ట్రోలింగ్

సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ట్రోలింగ్ చేసే వాళ్ళు ఈ మధ్య మరీ దిగజారిపోతున్నారు. బ్రతికున్న మనుషులు ఆసుపత్రిలో ఉండగానే చనిపోయినట్టు ప్రచారాలు చేస్తున్నారు. రిలీజవుతున్న సినిమాలను లక్ష్యంగా పెట్టుకుని అట్టడుగు స్థాయికి వెళ్లిపోతున్నారు. హనుమంతుడికి ఒక సీట్ వదలడం ఒక పవిత్ర ఉద్దేశం కోసమని దర్శకుడు ఓం రౌత్ తో పాటు టీమ్ మొత్తం ఎంతగా చెబుతున్నా సదరు బ్యాచీలకు వినిపించడం లేదు. తాజాగా ఆదిపురుష్ థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదనే ఒక నీచమైన మార్ఫింగ్ ఇమేజ్ ని ట్విట్టర్, ఇన్స్ టాలో వైరల్ చేస్తున్నారు.

నిజానికి అలాంటి ఆలోచనే ఎవరూ చేయరు. ఆధునిక ప్రపంచంలో మనపక్కన ఎవరున్నారో పట్టించుకోలేనంత బిజీగా మనిషి జీవితం యాంత్రికమైపోయింది. అలాంటిది ఏ కులం, ఏ మతం అని చెక్ చేసుకునే తీరిక ఎవరికీ లేదు. ఆ మాటకొస్తే సినిమాకు వెళ్ళినప్పుడు అసలీ పట్టింపులకు అవకాశమే లేని చోటది. ఇది తెలిసి కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆదిపురుష్ మీద నెగటివ్ క్యాంపైన్ చేస్తున్న వాళ్ళను కనిపెట్టేందుకు టి సిరీస్ టీమ్ రంగంలోకి దిగబోతోందని సమాచారం. ఎవరు సృష్టించారో మూలాలు కనుక్కుంటే అడ్డుకట్ట వేయడం సులభమవుతుంది

విడుదలకు ఇంకా ఏడు రోజులు ఉండగానే ఈ స్థాయిలో మరకలు అంటించే ప్రయత్నాలు చేయడం విచారకరం. ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదిపురుష్ మీద బోలెడంత బజ్ తీసుకొచ్చాయి. నిన్న తిరుమలలో సెలవు తీసుకునే సమయంలో కృతి సనన్ ని ఆశీర్వదించడం కోసమని ఓం రౌత్ ముద్దు పెట్టుకోవడం పట్ల కూడా చిన్నపాటి రగడ చేస్తున్నారు. అది దురుద్దేశంతో చేసింది కాకపోయినా దానికి రకరకాల అర్థాలు ఆపాదిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రిలీజయ్యాక కంటెంట్ ని పోస్ట్ మార్టం చేసి ఎన్నెన్ని వక్రభాష్యాలు తీస్తారో ఊహించడం కష్టమే