బోల్తా కొట్టిన బాలీవుడ్ నగరం

కార్తీ ఖైదీతో సెన్సేషన్ సృష్టించి కమల్ హాసన్ విక్రమ్ తో టాప్ లీగ్ లోకి చేరిపోయిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ డెబ్యూ మూవీ మానగరంకి మంచి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అందులో స్క్రీన్ ప్లే మేజిక్ చూసే ఇతర అవకాశాలు క్యూ కట్టాయి. సందీప్ కిషన్, రెజీనాలకు తమిళంలో గుర్తింపు తెచ్చింది ఈ సూపర్ హిట్టే. ఇది వచ్చి ఆరేళ్ళు దాటేసింది. బాలీవుడ్ రీమేక్ ని ఎవరూ ట్రై చేయలేదు. బాగా గ్యాప్ తీసుకుని విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ముంబైకర్ గా ఇటీవలే తీసుకొచ్చారు. థియేటర్ కు వర్కౌట్ కాదని ముందే గుర్తించి ఇటీవలే జియో సినిమా యాప్ లో డైరెక్ట్ ఓటిటి స్ట్రీమింగ్ చేశారు.

మానగరంలో మంచి థ్రిల్లింగ్ యాక్షన్ లైన్ ఉంది. దాదాపు కథని యధాతథంగా తీసుకున్నారు. ముంబై మాఫియా డాన్ పీకేపి(రణ్వీర్ షోరే) కొడుకుని మున్నా(విజయ్ సేతుపతి) గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. వాస్తవానికి అతని మేనేజర్ అబ్బాయిని అపహరించబోయి పొరపాటు చేస్తుంది. ఈ హడావిడిలో అనుకోకుండా ఓ యువకుడు(విక్రాంత్ మస్సే), అతని ప్రియురాలు(తాన్యా) ఇరుక్కుంటారు. ఓ టాక్సీ డ్రైవర్(నంజయ్ మిశ్రా) కూడా తోడవుతాడు. అసలు ఇంతమంది ఈ వ్యూహంలోకి ఎలా వచ్చారు, పీకేపి ముఠా నుంచి మున్నాతో పాటు ఇతరులు ఎలా తప్పించుకున్నారనేది అసలు స్టోరీ

ఎంతో గ్రిప్పింగ్ గా సాగే మానగరం స్క్రీన్ ప్లేని ముంబైకర్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కం దర్శకుడు సంతోష్ శివన్ కంగాళీ చేశారు. కథనం చాలా ఫ్లాట్ గా వెళ్లడంతో తొలుత చాలాసేపు అయోమయం కలుగుతుంది. ఆసక్తి కలిగించే అవకాశమున్న సన్నివేశాలు కూడా చప్పగా తేలిపోయాయి. అధిక శాతం విపరీతమైన బోర్ కొట్టిస్తుంది. ఇంత క్వాలిటీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ దాన్ని సరిగా వాడుకోవడంలో సంతోష్ తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లు దీనికి దూరంగా ఉండటం మంచిది. యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేసినప్పుడు ఉప్పు కారం లేని బిర్యానీని ఎవరైనా ఎలా తింటారు