రియల్ దొంగ కథతో కార్తి సినిమా?

తమిళ కథానాయకుడు కార్తి చేసే సినిమాల్లో ఒకదాంటో ఇంకోదానికి సంబంధం ఉండదు. అంత వైవిధ్యమైన కథలతో అడుగులు వేస్తుంటాడతను. ప్రస్తుతం అతను ‘జపాన్’ అనే క్రేజీ మూవీలో నటిస్తున్నాడు. కమెడియన్ యోగిబాబు హీరోగా ‘మండేలా’ అనే వెరైటీ సినిమా తీసి విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రాజా మురుగన్ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది.

ఈ మధ్యే రిలీజైన ‘జపాన్’ టీజర్ భలేగా అనిపించింది ప్రేక్షకులకు. కార్తి ఖాతాలో ఇంకో హిట్ పడటం ఖాయం అనే ఫీలింగ్ కలిగించిందా టీజర్. కాగా ఈ సినిమా కథ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఇది ఒక రియల్ దొంగ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోందట. తమిళనాట బాగా పాపులర్ అయిన ఆ దొంగ పేరు మురుగన్. 2009లో ఈ మురుగన్ పేరు మీడియాలో మార్మోగింది.

ఫేమస్ జ్యువలరీ చైన్ ‘లలిత జువెలర్స్’లో 2009లో మురుగన్ భారీ దొంగతనం చేశాడు. అప్పట్లోనే ఏకంగా 13 కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లాడు. కానీ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. బంగారం దుకాణాల్లో ఎంతో చాకచక్యంగా దొంగతనం చేయడంలో మురుగన్ నైపుణ్యం సంపాదించాడు. అతను వేరే దొంగతనాలు కూడా చేశాడు. ఇతడి కథలో అనేక ఆసక్తికర మలుపులు ఉండటంతో దానికి కొంత ఫిక్షన్ జోడించి కార్తి పాత్రను తీర్చిదిద్దారట.

మురుగన్ మూడేళ్ల కిందట జైల్లో చనిపోయాడు. అతడికి ఎయిడ్స్ ఉన్నట్లు కూడా వెల్లడైంది. ఐతే సినిమాలో కార్తికి ఎయిడ్స్ ఉన్నట్లు చూపించకపోవచ్చేమో. నిజ జీవిత కథలకు ఫిక్షన్ జోడించి ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో తమిళ దర్శకులు నేర్పరులే. రాజా మురుగన్ ‘మండేలా’లో గొప్ప ప్రతిభే చూపించాడు. కాబట్టి కార్తితో అతను తీస్తున్న ‘జపాన్’ సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా నటిస్తోంది.