నీల్ ప్లాన్లన్నీ టాలీవుడ్ హీరోలతోనే

విడుదల ముందు వరకు ఎలాంటి అంచనాలు లేకుండా కెజిఎఫ్ రూపంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్. శాండల్ వుడ్ కు మొదటి వెయ్యి కోట్ల సినిమా అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న సలార్ మీద అంచనాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. ఆదిపురుష్ ఎంత బాగా ఆడినా డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ మాత్రం దీనికోసమే ఉంది. అయితే నీల్ కన్నడ చిత్రాలకే పరిమితం కావాలని, అక్కడి స్టాండర్డ్స్ ని ఇంకా పెంచాలని మూవీ లవర్స్ ఎంత పోరు పెడుతున్నా అతను మాత్రం టాలీవుడ్ నే శాశ్వత అడ్డాగా మార్చుకోబోతున్నాడు.

దీనికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. సలార్ అయిపోయాక ప్రశాంత్ నీల్ వెంటనే ఎన్టీఆర్ 31 మొదలుపెడతాడు. ఎంత లేదన్నా షూటింగ్ ఏడాది పైగానే పడుతుంది. ఆ తర్వాత సలార్ 2 తాలూకు పనులు ఉంటాయి. సీక్వెల్ అఫీషియల్ గా చెప్పకపోయినా ఆల్రెడీ లాక్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్. ఇది పూర్తి చేశాక రామ్ చరణ్ తో ప్రాజెక్టు ఉంటుంది. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు. కెజిఎఫ్ 3 అన్నారు కానీ అది కార్యాచరణలో జరగడం అనుమానమే. ఇది మినహాయించి చూసుకున్నా ప్రశాంత్ పై వన్నీ పూర్తి చేసుకునేసరికి ఎంత లేదన్నా 2026 వచ్చేస్తుంది

ఆలోగా కొత్త కమిట్ మెంట్లు కాంబినేషన్లు ఎలాగూ ఉంటాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో చేసేందుకు నీల్ చాలా ఆసక్తిగా ఉన్నాడు. అడగాలే కానీ వాళ్ళు నో చెప్పరు. అలాంటప్పుడు తిరిగి కన్నడ గూటికి చేరుకోవడం జరిగే పని కాదు. పైగా కెజిఎఫ్ కు యష్ దొరికాడు కానీ ప్రతిసారి అలాంటి హీరోలను సెట్ చేసుకోవడం అంత సులభం కాదు. అయితే తెలుగులో బోలెడు ఆప్షన్లున్నాయి. మార్కెట్ కూడా చాలా పెద్దది. కాబట్టి ఇంకో పదేళ్ల దాకా నీల్ జెండా తెలుగు నుంచి కదలడం కష్టమే. ఆదిపురుష్ రిలీజైన వారం పది రోజుల్లో సలార్ ప్రమోషన్లకు భారీ ఎత్తున మొదలుపెట్టబోతున్నారు