యానిమల్ కథ లీక్ అయ్యిందా

అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసింది దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ ఒకటే. కొత్త కథతో ఇంకో మూవీ చేయలేదు. అందుకే ప్రస్తుతం రన్బీర్ కపూర్ యానిమల్ మీద అంచనాలు మాములుగా లేవు. ఆగస్ట్ 11 విడుదల కాబోతున్న ఈ హై వోల్టేజ్ వయొలెంట్ ఎంటర్ టైనర్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పఠాన్, ఆదిపురుష్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కు వసూళ్ల వర్షం కురిపించే బొమ్మగా దీని మీద బయ్యర్ల అంచనాలు మాములుగా లేవు. దీని స్టోరీకి సంబంధించిన ఒక లీక్ ముంబై మీడియాలో చక్కర్లు కొడుతోంది

దాని ప్రకారం యానిమల్ లో రన్బీర్ ఫిజిక్స్ బోధించే లెక్చరర్ గా కనిపిస్తాడు. ముందు చాలా సాత్వికంగా ఉంటాడు. తండ్రి అనిల్ కపూర్ పేరు మోసిన గ్యాంగ్ స్టర్. శత్రువు బాబీ డియోల్ చీకటి సామ్రాజ్యంలోని శక్తులతో కలిసి మోసం చేయడంతో అనిల్ చనిపోతాడు. దీంతో రన్బీర్ లో మనిషి  మృగంగా మారిపోయి హత్యాకాండ మొదలుపెడతాడు. అది ఎంత దారుణంగా ఉంటుందంటే పోలీసులు సైతం వణికి పోయేంతగా. అగ్రెసివ్ హీరోయిజమ్ ని చూపించడంలో సందీప్ వంగా స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది

ఇది అధికారికంగా బయటికొచ్చింది కాదు కానీ లీకైన షూటింగ్ పిక్స్ చూస్తే ఇందులో నిజం ఉందని అనిపించకపోదు. రిలీజ్ కు ఇంకో రెండు నెలలే ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. అదే రోజు సన్నీ డియోల్ గద్దర్ 2 విడుదల కానుంది. యానిమల్ తో సమానంగా బజ్ లేకపోయినా కల్ట్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా దాన్ని తక్కువంచనా వేయడానికి లేదు. పైగా మాస్ మార్కెట్ లో గదర్ బ్రాండ్ కున్న విలువ చాలా ఎక్కువ. తెలుగులో భోళా శంకర్, తమిళంలో జైలర్ పోటీగా ఉన్నాయి. యానిమల్ తర్వాత సందీప్ వంగా ప్రభాస్ స్పిరిట్ పనులు మొదలుపెడతాడు