రానా పెళ్లిలో ఆ ఫ్యామిలీ లేదే..

మొత్తానికి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన రానా దగ్గుబాటి కూడా పెళ్లి చేసేసుకున్నాడు. కొన్ని నెలల ముందు వరకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేనట్లు కనిపించిన రానా.. ఉన్నట్లుండి మిహీకా బజాజ్‌తో ఎంగేజ్ అయినట్లు ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా ఆలస్యం చేయకుండా పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు.

శనివారం రాత్రి వీరి వివాహం జరిగింది. దగ్గుబాటి వారి ఇంట చాన్నాళ్లకు జరిగిన పెళ్లి ఇది. చాలా ఘనంగానే జరుపుకోవాలి. కానీ కరోనా ముప్పు నేపథ్యంలో మామూలు రోజుల్లో మాదిరి హడావుడి చేసే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు కాకుండా ఇండస్ట్రీ నుంచి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. కానీ ఆ జాబితాలో ఓ పెద్ద కుటుంబం నుంచి ఎవ్వరూ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

టాలీవుడ్లో పెద్ద కుటుంబాలు అంటే.. మెగా, దగ్గుబాటి, అక్కినేని, నందమూరిలవే. పెళ్లి జరిగింది దగ్గుబాటి వారి ఇంట కాబట్టి.. మిగతా మూడు పెద్ద కుటుంబాల నుంచి కనీసం ఒక్కొక్కరైనా ప్రతినిధులుండాలి. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లిలో పాల్గొన్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సమంత వచ్చారు. వాళ్లు కూడా దగ్గుబాటి కుటుంబ సభ్యులే ఒక రకంగా.

ఇక మిగిలింది నందమూరి ఫ్యామిలీ. ఆ కుటుంబం నుంచి ఎవ్వరూ పెళ్లికి రాలేదు. నందమూరి బాలకృష్ణ కుటుంబాన్ని అసలు ఆహ్వానించారా లేదా అన్నది సందేహం. కనీసం తన మిత్రుడే అయిన జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా రానా పిలవలేదా.. లేక బాలయ్యను పిలవకుండా తారక్‌ను పిలిచి అతను హాజరైతే బాగోదని ఆగిపోయాడా అన్నది తెలియదు. కరోనా పేరుతో కవర్ చేసేయొచ్చు కానీ.. నందమూరి కుటుంబం నుంచి ఒక్కరైనా ఈ పెళ్లిలో పాల్గొని ఉంటే నిండుతనం వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.