తీన్ మార్ ప‌వ‌న్ చేయాల్సింది కాదు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లో మంచి ఫీల్ ఉన్న సినిమాల్లో తీన్ మార్ ఒక‌టి. హిందీ హిట్ ల‌వ్ ఆజ్ క‌ల్‌కు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో అదిరిపోయే పాట‌లుంటాయి. మంచి ఫీల్ ఉన్న ల‌వ్ సీన్స్ ఉంటాయి. రెండు పాత్ర‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెర్ఫామెన్స్ ఆక‌ట్టుకుంటుంది. ఇక డైలాగ్స్ కూడా సూప‌ర్ అనే చెప్పాలి. త్రివిక్ర‌మ్ సాయంతో ఈ సినిమాను అందంగా తీశాడు జ‌యంత్ సి.ప‌రాన్జీ.

కానీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా ఆశించిన ప‌లితాన్ని అందుకోలేక‌పోయింది. ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌తో ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. కానీ త‌ర్వాత టీవీల్లో, డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమాకు మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అని చాలామంది ఆశ్చ‌ర్య‌పోతుంటారు. ఐతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజే ఈ సినిమాకు మైన‌స్ అయిందంటున్నాడు ద‌ర్శ‌కుడు జ‌యంత్.

తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో తీన్‌మార్ ఫెయిల్యూర్ గురించి జ‌యంత్ మాట్లాడాడు. ఈ సినిమా గురించి ప‌వ‌న్ అభిమానులు త‌ర్వాతి కాలంలో ఇచ్చిన ఫీడ్ బ్యాక్ త‌న‌కు షాకిచ్చింద‌ని జ‌యంత్ తెలిపాడు. ప‌వ‌న్ ప్రేమించిన అమ్మాయి వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవ‌డం.. తిరిగి త‌న ద‌గ్గ‌రికి రావ‌డం త‌మ‌కు న‌చ్చ‌లేద‌ని ఫ్యాన్స్ చెప్పిన‌ట్లు జ‌యంత్ వెల్ల‌డించాడు.

అభిమానులు ఇలా ఆలోచిస్తార‌ని అనుకోలేద‌ని.. దీన్ని బ‌ట్టి ప‌వ‌న్ ఇమేజే సినిమాకు ప్ర‌తిబంధ‌కంగా మారింద‌ని అర్థ‌మైన‌ట్లు జ‌యంత్ తెలిపాడు. ప‌వ‌న్ ఎంతో న‌చ్చి చేసిన సినిమా ఇద‌ని ఆయ‌న‌న్నాడు. ఐతే ఆయ‌న బ‌దులు త‌రుణ్ లేదా సిద్దార్థ్ లాంటి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో ఈ సినిమా చేస్తే మంచి ఫ‌లితం వ‌చ్చేదేమో అని జ‌యంత్ అభిప్రాయ‌ప‌డ్డాడు. తీన్‌మార్ ఫెయిల్యూర్‌తో జ‌యంత్ కెరీర్‌కు దాదాపుగా ఎండ్ కార్డ్ ప‌డిపోయింద‌ని చెప్పాలి.