నిఖిల్ ‘స్వయంభు’ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ


నిఖిల్‌ సిద్దార్థను చూసి టాలీవుడ్లో ఇప్పుడే వేరే యంగ్ హీరోలు అసూయ చెందేలా ఉంది అతడి లైనప్. ‘కార్తికేయ-2’ పాన్ ఇండియా స్థాయలో పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో అతడి క్రేజ్ మామూలుగా లేదు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలే సెట్ అవుతున్నాయి అతడికి. ఆ సినిమాల కాన్వాస్, బడ్జెట్, మార్కెట్ కూడా వేరే స్థాయిలో ఉండేలా కనిపిస్తున్నాయి. ఈ మధ్యే రిలీజైన ‘స్పై’ టీజర్ చూస్తే అది వేరే రేంజ్ మూవీ అయ్యేలా కనిపించింది. అలాగే ‘ది ఇండియా హౌస్’ కూడా పెద్ద రేంజి సినిమా అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

వీటిని మించి నిఖిల్ హీరోగా ప్రకటించిన కొత్త చిత్రం ‘స్వయంభు’ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా ఒక సడెన్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. చారిత్రక నేపథ్యంలో నిఖిల్‌ను యుద్ధ వీరుడిగా చూపిస్తూ ఒక సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.

‘స్వయంభు’తో భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. అతను తమిళుడు. దర్శకుడిగా ఇదే తొలి సినిమా. రచయితగా తమిళంలో కొన్ని సినిమాలకు పని చేశాడు. అతను చోళుల నేపథ్యంలో ఒక ఆసక్తికర వారియర్ స్టోరీ రెడీ చేసుకుని నిర్మాత ఠాగూర్‌ మధును సంప్రదించాడు. ఆల్రెడీ నిఖిల్ డేట్లున్న మధు.. ‘కార్తికేయ-2’తో మారిన తన ఇమేజ్‌కు తగ్గట్లుగా పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

ఐతే కథలో తమిళ వాసనలు ఎక్కువ ఉండటం.. చోళుల నేపథ్యంలో ఆల్రెడీ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రావడంతో ఈ కథ మీద వర్క్ చేశారు. బింబిసార రచయిత వాసుదేవ్ సహకారంతో దర్శకుడు చోళుల కనెక్షన్ తీసేసి.. దీన్నొక ఫిక్షనల్ స్టోరీగా మార్చినట్లు సమాచారం. పర్ఫెక్ట్‌గా స్క్రిప్ట్ రెడీ అయ్యాక సినిమాను అనౌన్స్ చేశారు. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. మనోజ్ పరమహంస, రవి బస్రూర్ లాంటి టాప్ టెక్నీషియన్లు పని చేస్తుండటం సినిమాకు పెద్ద ప్లస్సే.