కృష్ణ అభిమానుల కడుపు నిండిపోయింది


ఏడాది కాలంగా టాలీవుడ్లో రీ రిలీజ్‌ల హంగామా నడుస్తోంది. ఐతే పోకిరి, జల్సా లాంటి సినిమాలను మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానులు బాగానే ఎంజాయ్ చేశారు కానీ.. రీ రిలీజ్‌ల్లో కూడా రికార్డుల గొడవలు మొదలవడంతో ఇదొక ప్రహసనం లాగా తయారైంది ఒక దశ తర్వాత. ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.. ఎన్ని షోలు వేస్తున్నారు.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. వసూళ్లు ఎన్ని వచ్చాయి.. థియేటర్లలో సంబరాలు ఎలా ఉన్నాయి.. అనే విషయాల్లో కూడా లెక్కలేసుకోవడం మొదలై ఈ రీ రిలీజ్‌ల వ్యవహారమే పక్కదారి పడుతున్ సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి టైంలో ఒక క్లాసిక్ మూవీ ఈ గొడవలేమీ లేకుండా అభిమానులకు మరపురాని అనుభూతిని ఇస్తోంది. ఆ చిత్రమే.. మోసగాళ్ళకు మోసగాడు. సూపర్ స్టార్ కృష్ణ మరణానంతరం తొలి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు.

ఈ సినిమా స్పెషల్ షోలను కృష్ణ కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదిరిపోయే ప్రింట్ రెడీ చేసింది. అలాగే రిలీజ్‌కు మంచి ఏర్పాట్లు చేసింది. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తమ వంతు సహకారం అందించారు. ఇక దశాబ్దాల నుంచి స్తబ్దుగా ఉన్న కృష్ణ అభిమానులు.. ఈ తరం ఫ్యాన్స్ లాగా అనవసర హంగామా చేయకుండా ఈ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌ను మళ్లీ థియేటర్లలో చూసే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. థియేటర్లలో గోల.. వసూళ్ల గొడవ.. ఇవేమీ లేకుండా సైలెంటుగా సినిమాను ఎంజాయ్ చేశారు.

ఇప్పటికీ ట్రెండీగా అనిపించేలా సినిమా ఉండటం.. ప్రింట్ అదిరిపోవడం.. కృష్ణను ఎన్నో ఏళ్ల తర్వాత వెండి తెరపై చూడటం వారికి మరపురాని అనుభూతిని ఇస్తోంది. రీ రిలీజ్ అంటే ఇలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చేలా ఉండాలే తప్ప.. రికార్డుల గొడవలు.. అవసరం లేని హంగామాలు ఎందుకు అనే అభిప్రాయాలు సినీ ప్రియుల్లో వ్యక్తమవుతున్నాయి.