రికార్డులన్నీ ‘వరదల్లో’ కొట్టుకుపోయాయి

మలయాళంలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మోహన్ లాలే. మమ్ముట్టి ఆయనకు దీటైన స్టారే కానీ.. ఆయన వయసు పెరిగేకొద్దీ మాస్ మసాలా సినిమాలు తగ్గించేసి ప్రయోగాత్మక పాత్రల వైపు మళ్లడంతో కలెక్షన్ల రికార్డులు ఆయనకు దూరమయ్యాయి. మోహన్ లాల్ కూడా అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తున్నప్పటికీ.. వాటితో పాటే భారీ యాక్షన్, మాస్ సినిమాలు కూడా చేస్తుండటంతో బాక్సాఫీస్ రికార్డులు ఎన్నో ఏళ్ల నుంచి ఆయన పేరు మీదే ఉంటున్నాయి.

దృశ్యం, పులి మురుగన్, లూసిఫర్ లాంటి సినిమాలు మలయాళ సినిమాల కలెక్షన్ల రికార్డలును  తిరగరాశాయి. ఐతే లాల్ పేరిట ఉన్న రికార్డులన్నింటినీ ఇప్పుడు ఒక మిడ్ రేంజ్ సినిమా బద్దలు కొట్టేసింది. ఆ సినిమాలో మరీ పెద్ద స్టార్లేమీ లేరు. అది భారీ చిత్రం కాదు.. అయినా వసూళ్ల రికార్డులన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఆ చిత్రమే.. 2018.

టొవినో థామస్, కుంచుకోబోబన్ లాంటి మిడ్ రేంజ్ హీరోలు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. వాళ్లు కూడా ఇందులో ఏమీ మాస్ హీరోల్లా కనిపించలేదు. వీర లెవెల్లో యాక్షన్ సీన్లు చేయలేదు. 2018లో కేరళను ముంచెత్తిన వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మే తొలి వారంలో విడుద‌లైన ఈ చిత్రం ఆరంభంలో ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌తోనే సాగింది. కానీ పాజిటివ్ మౌత్ టాక్ బాగా విస్త‌రించ‌డంతో సినిమాకు వ‌సూళ్లు అంత‌కంత‌కూ పెరిగాయి.  ఐదేళ్ల కింద‌టి వ‌ర‌ద‌ల దృశ్యాల‌ను క‌ళ్ల‌కు క‌డుతూ కేర‌ళ వాసుల‌ను భావోద్వేగాల్లో ముంచెత్తిన సినిమా కావ‌డంతో ఆ రాష్ట్ర జ‌నాలంద‌రూ ఈ సినిమా చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌రుస క‌ట్టారు.

దీంతో రూ.50 కోట్లు.. 100 కోట్ల మైలురాళ్ల‌ను దాటుకుంటూ సినిమా ముందుకు వెళ్లిపోయింది. తాజాగా పులి మురుగ‌న్ పేరిట ఉన్న ఆల్ టైం హైయెస్ట్ వ‌సూళ్ల రికార్డును కూడా 2019 దాటేసింది. రిలీజైన నాలుగు వారాల త‌ర్వాత కూడా ఈ సినిమాకు మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. వ‌చ్చే నెల 7 నుంచి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు చేసేందుకు ఒప్పందం చేసుకోకుంటే ఇంకా కొన్ని వారాలు 2018 నిల‌క‌డ‌గా వ‌సూళ్లు సాధించి రూ.200 కోట్ల మార్కును కూడా అందుకునే ఛాన్సుంది.