చిన్న ప్రయోగాలతో మైత్రికి వరస షాకులు  

ఒకపక్క ప్యాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి తక్కువ బడ్జెట్ తో చేస్తున్న చిన్న ప్రయత్నాలు ఎంత మాత్రం కలిసి రావడం లేదు. ఇటీవలే సత్తిగాని రెండెకరాలుని ఆహా ద్వారా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేశారు. పుష్పలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా నటించిన జగదీశ్ ఇందులో ప్రధాన పాత్ర. వెన్నెల కిషోర్ కి ఓ కీలక క్యారెక్టర్ దక్కింది. డార్క్ కామెడీ జానర్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఏదో డిఫరెంట్ గా చేయాలని దర్శకుడు అభినవ్ దండా ప్రయత్నించాడు. బిత్తిరి సత్తి, మురళీధర్ గౌడ్ లాంటి తెలుసున్న క్యాస్టింగ్ ని తీసుకున్నారు

కూతురి ఆరోగ్యం కోసం తాత ఇచ్చిన విలువైన రెండెకరాల పొలాన్ని అమ్మే క్రమంలో సత్తికి ఎదురయ్యే సంఘటనల సమాహారమే ఈ సినిమా. దీనికి వజ్రాల స్మగ్లింగ్ కాన్సెప్ట్ ని జోడించారు. పాయింట్ బాగానే ఉన్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో అభినవ్ తడబాటు తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. పేలవమైన కామెడీతో పాటు నత్తనడకన సాగే స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేయలేకపోయింది. అసలు మొదటి భాగమే ఇంత నీరసంగా ఉంటే సెకండ్ పార్ట్ ఉంటుందని క్లూ ఇవ్వడం మరో ట్విస్టు. సాంకేతికంగా మంచి సపోర్ట్ దక్కినా పూర్తి ప్రయోజనం కలగలేదు.

నిజానికి ఈ చిన్న ప్రయత్నాలు మైత్రికి కలిసి రావడం లేదు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హ్యాపీ బర్త్ డే, మీటర్, మెన్ టూ ఇలా తమ బ్యానర్ సహకారంతో మద్దతు ఇచ్చిన మీడియం రేంజ్ థియేటర్ కంటెంట్ మొత్తం నిరాశాజనకమైన ఫలితాలను అందించింది. కథలు నచ్చగానే ఓకే చెప్పేస్తున్నారు కానీ ప్రాక్టికల్ గా అవి వర్కౌట్ అవుతాయో లేదో చూసుకోవడం లేదు. రిటర్న్స్ పరంగా వీటికి నష్టం వచ్చి ఉండకపోవచ్చు కానీ  మైత్రి నుంచి వచ్చెది ఏదైనా సరే దానికో వెయిట్ ఉంటుందని ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్న తరుణంలో ఇకనైనా జాగ్రత్తగా ఉండక తప్పదు