మళ్ళీ ఎడిటింగ్ పనిలో ఏజెంట్ ?

అయిపోయిన పెళ్ళికి బాజాలు మాట్లాడితే కామెడీగా ఉంటుంది. చూస్తుంటే ఏజెంట్ వ్యవహారం అలాగే అనిపిస్తోంది. బాక్సాఫీస్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఏజెంట్ వాస్తవానికి మొన్న మే 19న ఓటిటిలో వచ్చేయాలి. థియేటర్లో మిస్ అయినవాళ్లు ఓసారి చూద్దాం లెమ్మని ఎదురు చూశారు. దీని తాలూకు హింట్ గతంలోనే సోనీ లివ్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇచ్చింది. తీరా చూస్తే ఆ రోజు డిజిటల్ ప్రీమియర్ జరగలేదు. సరే ఇంకో వారం పోస్ట్ పోన్ అయిందేమో అనుకున్నారు. కానీ జూన్ 23 కన్నా ముందు వచ్చే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ న్యూస్

దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఏజెంట్ ని మళ్ళీ ఫ్రెష్ గా ఎడిటింగ్ చేస్తున్నారట. ఏప్రిల్ నెలలో విపరీతమైన ఒత్తిడి మధ్య పోస్ట్ ప్రొడక్షన్ చేయడం వల్ల కత్తెరకు సరిగా పని చెప్పలేదట. దీని వల్లే అనవసరమైన సీన్లు, సాగదీసిన ఫైట్లు ఎక్కువయ్యాయని గుర్తించి ఆ మేరకు కోత కార్యక్రమం మొదలుపెట్టినట్టు తెలిసింది. పక్కనపెట్టిన ఫుటేజ్ లో కొన్ని భాగాలు కలిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. అధికారిక సమాచారం లేదు కానీ మొత్తానికి ఇదంతా గుట్టుగా జరిగిపోతోంది. ఒరిజినల్ వెర్షన్ యధాతథంగా వదిలితే ట్రోలింగ్ ప్రమాదం పసిగట్టారు కాబోలు

ఏది ఏమైనా ఏజెంట్ విషయంలో జరుగుతున్న ఓటిటి ఆలస్యం చాలా ఎక్కువ. అంత లేట్ చేస్తే ఉన్న కాసింత ఆసక్తి కూడా తగ్గిపోయి వ్యూస్ కు ఎసరుపడే ప్రమాదం ఉంది. ఫలితాన్ని ఎలాగూ మార్చలేనప్పుడు దాన్ని ఒప్పేసుకుని ప్రేక్షకులకు చిన్నితెరపై చూపించేస్తే ఓ పనైపోతుంది. ఇప్పుడు ఎడిటింగ్ చేయాలనుకోవడం మంచి నిర్ణయమే కానీ అదేదో త్వరగా అయిపోతే బాగుంటుంది కదా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ లో మమ్ముట్టి లాంటి మలయాళం స్టార్ హీరో కీలక పాత్ర చేయడంతో కేరళలోనూ థియేటర్ అనుభూతి మిస్ అయినవాళ్ళు దీని కోసం ఎదురు చూస్తున్నారు