ఇంతకీ మళ్ళీ పెళ్లి సాధించింది ఏమిటి  

టాలీవుడ్ మోస్ట్ బోల్డ్ కపుల్ గా నరేష్ పవిత్ర లోకేష్ లు వాళ్లకు వాళ్లే సినిమా పేరుతో ప్రమోట్ చేసుకుంటున్న మళ్ళీ పెళ్లి పట్ల ఆడియన్స్ ఆసక్తిగా లేరని కలెక్షన్లు తేటతెల్లం చేస్తున్నాయి. చాలా చోట్ల వచ్చిన కాసింత గ్రాస్ నుంచి ఖర్చులు తీసేయగా జీరో షేర్ వచ్చిందని ట్రేడ్ టాక్. అందుకే 2018, మేం ఫేమస్ లాగా ఎలాంటి ఫిగర్స్ ని బయటికి వదలడం లేదు. నిర్మాతగా నరేష్ సక్సెస్ మీట్ పెట్టి ఈ విజయం సూపర్ స్టార్ కృష్ణగారికి అంకితం ఇస్తున్నానని చెప్పడం తప్పించి దాని వల్ల పెద్దాయన ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు అభిమానులు కానీ స్పందించలేదు.

సరే ఇంతా చేసిన నరేష్ కు దక్కిన ఫలాలు కొన్ని ఉన్నాయి. మూడో భార్యను ఎందుకు దూరంగా పెట్టాల్సి వచ్చిందనే కోణంలో పలు విషయాలు ఇందులో చూపించారు. పార్వతి(సినిమాలో పేరు) ఇన్నేళ్లు భర్తతో మూడుముళ్లు వేయించుకోకుండా సహజీవనం చేశారనే ట్విస్టు బయట పడింది. ఈ రెండింటిలో నిజా నిజాలు ఎంత ఉన్నా ప్రేక్షకుల దృష్టిలో కొంత క్లారిటీ వచ్చింది. అయితే కూకట్ పల్లి కోర్టులో కేసు వేసిన రమ్య రఘుపతి నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది తెలియదు కానీ ఒకరకంగా తనను విలన్ ని చేసి చూపించారనే అంశాన్ని సినిమాని సాక్ష్యంగా చూపించొచ్చు.

కమర్షియల్ లెక్కల్లో నరేష్ కు నష్టం తప్పదని, ఆయనే చెప్పుకున్నట్టు వెయ్యి కోట్ల ఆస్తిలో ఇప్పుడీ మళ్ళీ పెళ్లి వల్ల పోయేది ఇసుమంతైనా ఉండదని ఇండస్ట్రీ కామెంట్స్. వ్యక్తిగత జీవితం మీద బయోపిక్కులు తీయించుకున్న సెలబ్రిటీలు అన్ని రంగాల్లో ఉన్నారు కానీ ఇలా పెళ్లిళ్ల మీద స్వయంగా నటించి మరీ కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఘనత మాత్రం నరేష్ కే దక్కుతుంది. నిన్న కొన్ని సెంటర్స్ ఆలా అలా నెట్టుకొచ్చినా ఇవాళ్టి నుంచి తీవ్రమైన డ్రాప్ కలెక్షన్లలో కనిపిస్తోంది. అధిక శాతం పబ్లిక్ ఓటిటిలో వస్తే చూద్దామని వెయిట్ చేస్తున్న మాట వాస్తవం