మంచి ఛాన్స్ మిస్సయిన కుర్రాడు

అందరూ కొత్త నటీనటులు చేసిన సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించి థియేటర్ల వరకు తీసుకురావడం చాలా కష్టమైపోతోంది ఈ రోజుల్లో. ప్రోమోలు సెన్సేషనల్‌గా ఉండి.. ప్రమోషన్లు వెరైటీగా చేసి.. కొంతమేర సెలబ్రెటీల సపోర్ట్ కూడా ఉంటే తప్ప అలాంటి సినిమాలకు మంచి రిలీజ్ దక్కదు. థియేటర్లలో జనాలు కనిపించరు. ఐతే 23 ఏళ్ల కుర్రాడైన సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో చేసిన ‘మేమ్ ఫేమస్’ యువ ప్రేక్షకుల్లో బాగానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగింది.

రిలీజ్‌కు ముందు రోజు హైదరాబాద్‌లో అరడజను దాకా పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే అవన్నీ ఫుల్ అయిపోయాయి. రిలీజ్ రోజు ఉదయం కూడా థియేటర్లు జనాలతో కళకళలాడాయి. కానీ ఎంతో ఆశించి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో చిత్ర బృందం విజయవంతం కాలేకపోయింది. ‘మేమ్ ఫేమస్’ ట్రైలర్ చూస్తే ఇది ‘జాతిరత్నాలు’ తరహాలో హిలేరియస్ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. ఐతే ఆ సినిమానే అనుకరిస్తూ సాగిన చిత్రంలో.. కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి.

కొన్ని క్యారెక్టర్లు.. జోకులు.. కామెడీ సీన్లు పేలాయి. కానీ సినిమా అంతా ఒక టెంపో మెయింటైన్ చేయడంలో దర్శకుడు సుమంత్ ప్రభాస్ విఫలమయ్యాడు. నిజానికి ఫస్టాఫ్ చూస్తే సినిమా క్లిక్ అయ్యేలాగే కనిపించింది. బోర్ కొట్టించకుండా సాగిపోయింది. ద్వితీయార్ధంలో కథ పరంగా కొంచెం ఇంటెన్సిటీ చూపించి.. ఫస్టాఫ్ ఉన్న టెంపోలోనే దాన్ని కూడా నడిపించి ఉంటే.. క్లైమాక్స్ కొంచెం బలంగా తీర్చిదిద్దుకుని ఉంటే ‘మేమ్ ఫేమస్’ బాక్సాఫీస్ పరీక్షను పాసైపోయింది.

సెకండాప్‌లో ఏ ఇంటెన్సిటీ లేకుండా.. యూట్యూబ్ వీడియోల చుట్టూ తిరిగే ఫిల్లింగ్ సీన్లు పెట్టి లాగించేయడంతో యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగే కలిగింది ప్రేక్షకులకు. నిజాయితీగా ఒక ప్రయత్నం చేసి.. ఒక దశ వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన టీం.. రెండో అర్ధం నుంచి చేతులెత్తేయడంతో ‘మేమ్ ఫేమస్’ మిక్స్డ్‌ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. పూర్తి సినిమా బాగా ఉంటే.. సుమంత్ ప్రభాస్ పేరు మార్మోగిపోయేది. అతడి కెరీరే మారిపోయేది. అంది వచ్చిన అవకాశాన్ని ‘మేమ్ ఫేమస్’ దర్శకుడు సుమంత్ ప్రభాస్ చేజేతులా దెబ్బ తీసుకున్నట్లయింది.