తమ్ముళ్ల సందడి.. హిట్టెవరికి ? 

వచ్చే వారం ఇద్దరు కుర్ర హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న ‘అహింస’ తో పాటు , బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన ‘నేను స్టూడెంట్ సర్’ కూడా థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ఈ ఇద్దరిలో ఒకరు రాణా తమ్ముడు కాగా , మరొకరు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు అనే విషయం తెలిసిందే. ఇలా హీరోల తమ్ముళ్ళు ఒకే రోజు డిఫరెంట్ మూవీస్ తో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. 

అభిరామ్ ‘అహింస’ తో పాటు ‘నేను స్టూడెంట్ సర్’ కూడా ఇప్పటికే ఒక డేట్ అనుకొని మళ్ళీ వాయిదా పడిన సినిమానే. ఇప్పుడు సరైన టైమ్ చూసుకొని ఈ రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. వచ్చే శుక్రవారం అంటే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణాలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో కుర్ర హీరోలకి ఇది మంచి డేట్ అని చెప్పవచ్చు.  

కంటెంట్ తో అలరించి, హిట్ టాక్ తెచ్చుకుంటే సెలవు రోజు కనుక నైజాంలో మ్యాట్నీ నుండే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ నటించిన ‘అహింస’ కంటే రాకేశ్ అనే కొత్త దర్శకుడు తీసిన ‘నేను స్టూడెంట్ సర్’ అనే సినిమా కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే మొదటి రోజు మార్నింగ్ షోకి ఆడియన్స్ ను రప్పించే స్టామినా ఈ ఇద్దరు కుర్ర హీరోలకి లేదు, టాక్ మీదే రిజల్ట్ ఆధారపడి ఉంది.