మేమెవరినీ టార్గెట్ చేయట్లేదు-పవిత్ర లోకేష్

కొత్త సినిమాలు రిలీజవుతున్నపుడు క్యారెక్టర్ నటులు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, సినిమాను ప్రమోట్ చేయడం అరుదుగా జరుగుతుంటుంది. అందులోనూ లేడీ ఆర్టిస్టులకైతే అసలే అవకాశం దక్కదు. కానీ ఆ క్యారెక్టర్ నటులే లీడ్ రోల్స్ చేయడం వల్ల ‘మళ్ళీ పెళ్ళి’ సినిమా ప్రమోషన్లలో మాత్రం వాళ్లే ప్రమోషన్లలో కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్.. ఆయన భాగస్వామి అయిన కన్నడ నటి పవిత్ర లోకేష్ లీడ్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లను యువ నటీనటులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రమోట్ చేస్తున్నారు నరేష్, పవిత్ర.

మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్లో వాళ్లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అలాగే నరేష్, పవిత్ర వేర్వేరుగా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. పవిత్ర తాజాగా మీడియా ప్రతినిధులను కలిసింది. ‘మళ్ళీ పెళ్ళి’ ఎవరినీ టార్గెట్ చేసిన సినిమా కాదని ఆమె తేల్చి చెప్పింది.

నరేష్, పవిత్రల నిజ జీవిత బంధం నేపథ్యంలోనే ఈ సినిమా సాగేట్లు కనిపిస్తోంది. వనిత విజయ్ కుమార్ చేసిన పాత్ర.. నరేష్ మూడో భార్య రమ్యదిగా భావిస్తున్నారు. కానీ నరేష్, దర్శకుడు ఎం.ఎస్.రాజు ఈ ఊహాగానాలను ఖండించారు.

ఇక పవిత్ర మాట్లాడుతూ.. ‘‘ఇది నిజ జీవిత అంశాలతో తెరకెక్కిన సినిమా కాదు. కల్పిత విషయాలే ఉంటాయి. అంతే కాదు.. ఇది ఏ ఒక్క వ్యక్తినీ టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కాదు. నన్ను పాత్ర డిమాండ్ చేసింది కాబట్టే తీసుకున్నారు తప్ప.. మరో రకంగా కాదు. నా పాత్ర విపరీతంగా నచ్చే ఈ సినిమా చేశా’’ అని చెప్పింది. నరేష్ గురించి చెబుతూ.. ‘‘ఆయనొక అద్భుతమైన వ్యక్తి. ఆయన నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నరేష్ గారు చాలా సరదాగా ఉండే మనిషి. ఎక్కువ కంగారు పడకుండా ఏ విషయాన్నయినా ఎలా డీల్ చేయాలో ఆయన్ని చూసే నేర్చుకున్నా’’ అని పవిత్ర తెలిపింది.