భారతీయ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లది అరుదైన జోడీ. తండ్రి ఇండియన్ సినిమాలో పీక్స్‌ను చూస్తే.. ఆయన తనయుడిగా రంగ ప్రవేశం చేసి.. తక్కువ సమయంలోనే పెద్ద స్టార్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చిరు కూడా అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు.
అయినా సరే.. తన తండ్రి ముందు తాను చాలా చిన్నవాడిననే ఫీలవుతాడు చరణ్. తన తండ్రి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా గొప్పగా మాట్లాడతాడు. ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతున్న జీ20 సదస్సుకు భారతీయ సినిమా ప్రతినిధిగా హాజరైన చరణ్.. కశ్మీర్ ప్రత్యేకత, భారతీయ సినిమా విశిష్టత గురించి మాట్లాడుతూనే.. మధ్యలో తన తండ్రి ప్రస్తావన తెచ్చాడు. తనకు ఆయనే స్ఫూర్తి అని చెబుతూ 68 ఏళ్ల వయసులో చిరు సినిమాల కోసం పడుతున్న కష్టాన్ని వివరించాడు.
‘‘నాకు మా నాన్నగారే స్ఫూర్తి. ఆయనతో పాటు షూటింగ్ చూడటం కోసం చిన్నపుడు కశ్మీర్‌కు వచ్చాను. ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని దర్శించాను. ఇప్పుడు జీ20 సదస్సు కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న వయసు 68 ఏళ్లు. ఆయన ప్రస్తుతం నాలుగు సినిమాలకు సంతకం చేశారు. ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషకం అందుకునే నటుల్లో ఆయనొకరు. రోజూ ఉదయం 5.30కే నిద్ర లేస్తారు. తర్వాత వర్కవుట్ చేస్తారు. ఆపై రోజు వారీ పనికి వెళ్లిపోతారు. 68 ఏళ్ల వయసులోనూ పని పట్ల ఆయన చూపించే నిబద్ధత నాకు స్ఫూర్తినిస్తుంది. మరింత కష్టపడడానికి ప్రేరణగా నిలుస్తుంది’’ అని చరణ్ జీ20 సమ్మిట్లో తన తండ్రికి అదిరే ఎలివేషన్ ఇచ్చాడు.
కశ్మీర్ భూతల స్వర్గం అని.. ఇక్కడ షూటింగ్‌లు చేసుకోవడానికి అద్భుత అవకాశం ఉందని.. ఒక వేళ తనకు హాలీవుడ్ ఆఫర్లు వస్తే.. ఇండియాకే వచ్చి కశ్మీర్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయాలని షరతులు పెడతానని చరణ్ చెప్పడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates