బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన అనురాగ్ కశ్యప్‌కు దక్షిణాది సినిమాలు, ఇక్కడి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఎంతో ఆసక్తి, గౌరవం ఉన్నాయి. తరచుగా దక్షిణాది సినిమా, ఇక్కడి నటీనటుల గురించి గొప్పగా మాట్లాడుతుంటాడు. తన కొత్త చిత్రం ‘కెన్నడీ’ని తమిళ నటుడు విక్రమ్‌తో తీయాలన్నది ఆయన ఉద్దేశమట.
ఆయన్ని దృష్టిలో ఉంచుకునే ఈ కథ రాశానని.. ఐతే కథ చెప్పాక విక్రమ్ నుంచి రియాక్షన్ లేకపోవడంతో రాహుల్ భట్‌తో తీయాల్సి వచ్చిందని అనురాగ్ వెల్లడించడం చర్చనీయాంశం అయింది. విక్రమ్ కనీసం ఎస్ ఆర్ నో కూడా చెప్పకపోవడమేంటి అన్న సందేహాలు కలిగాయి. ఐతే అనురాగ్ వ్యాఖ్యలపై విక్రమ్ కొంచెం ఆగ్రహంగానే స్పందించాడు. తన ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా ఖండించాడు.
‘‘డియర్ అనురాగ్ కశ్యప్.. సోషల్ మీడియాలోని స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఏడాది కిందట మన మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ సినిమా కోసం నన్ను ఈమెయిల్, మెసేజ్‌ల రూపంలో సంప్రదించినప్పటికీ.. నా నుంచి మీకు సమాధానం రాలేదని గతంలో మీరు ఒక నటుడితో చెప్పారు. అతడి ద్వారా విషయం తెలుసుకున్న నేను వెంటనే మీకు కాల్ చేశాను. మీరు మెసేజ్‌లు పంపిన మెయిల్ ఐడీ యాక్టివ్‌గా లేదని.. నా మొబైల్ నంబర్ కూడా మార్చేశానని.. అందుకే రీచ్ కాలేకపోయారని అప్పుడే మీకు చెప్పాను. కెన్నడ కథ నాకు నచ్చిందని కూడా మీకు చెప్పాను కదా’’ అని విక్రమ్ ట్వీట్ చేశాడు.
అనంతరం అనురాగ్ స్పందిస్తూ.. ‘‘నిజమే బాస్.. ఒక నటుడి ద్వారా విషయం తెలుసుకున్న మీరు నన్ను సంప్రదించారు. అప్పుడే మాకు తెలిసింది మీ నంబర్ మారిందని. మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వివరాలు మాకు ఇచ్చారు. అలాగే స్క్రిప్టు చదవడానికి కూడా ఆసక్తి కనబరిచారు. కానీ అప్పటికే మేం వేరే నటుడితో షూట్ కోసం షెడ్యూల్ సిద్ధం చేసుకున్నాం. మా చిత్రానికి విక్రమ్ అసలు పేరైన ‘కెన్నడీ’ కూడా పెట్టుకోవడానికి అంగీతకరించారు. నేను ఇటీవలి ఇంటర్వ్యూలో కెన్నడీ అనే టైటిల్ వెనుక కారణం మాత్రమే చెప్పాను. నా వ్యాఖ్యలను అతిగా చూడకండి. విక్రమ్‌తో పని చేయకుండా అయితే రిటైర్ కాను’’ అన్నాడు.