సీనియర్ నటుడు నరేష్ హీరో వేషాలు వేసి దశాబ్దాలు కావస్తోంది. ఆయన పేరున్న సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ మంచి మంచివే చేస్తున్నారు కానీ.. తనకంటూ ఒక మార్కెట్ అయితే లేదు. హీరోగా చేసినపుడు కూడా చాలా వరకు కామెడీ పాత్రలే చేశారు. కాబట్టి ఆయనకు మాస్ ఫాలోయింగ్, అభిమాన గణం అంటూ పెద్దగా లేకపోయింది.
90వ దశకంలోనే హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో.. నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్‌లోకి మారిపోయారు. వాటితోనే అలరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న నటుడు.. ఈ వయసులో హీరోగా సినిమా చేయడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. నరేష్‌తో కొన్నేళ్లుగా కలిసి ప్రయాణం సాగిస్తున్న పవిత్ర లోకేష్ ఇందులో ఆయనకు జోడీగా నటించింది. దాదాపుగా వీరి నిజ జీవిత కథనే ఈ సినిమాలో చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎం.ఎస్.రాజు లాంటి వయసు పైబడ్డ నిర్మాతే ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
ఇలాంటి సినిమాకు యూత్‌లో క్రేజ్ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాను అనౌన్స్ చేసినపుడు.. నరేష్‌కు డబ్బులు ఎక్కువై ముచ్చట తీర్చుకుంటున్నారు తప్ప.. ఈ సినిమాను ఎవరు పట్టించుకున్నారు అనుకున్నారు చాలామంది. ఐతే నరేష్ నిజ జీవిత విషయాలతో ముడిపెట్టి కథను అల్లడం వల్ల దీని పట్ల జనాల్లో కొంత ఆసక్తి పుట్టింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన టీజర్.. ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. రిలీజ్ ముంగిట ప్రమోషన్లను కూడా హోరెత్తించేస్తోంది చిత్ర బృందం.
వేరే సినిమాల ఇంటర్వెల్స్‌లో ‘మళ్ళీ పెళ్ళి’ ట్రైలర్ ప్రదర్శిస్తుంటే.. జనాల కేరింతలు చూస్తే యూత్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని అర్థమవుతోంది. ఈ నెల 26న రిలీజవుతున్న ‘మళ్ళీ పెళ్ళి’ చూసేందుకు జనం మరీ ఎగబడి థియేటర్లకు వచ్చేస్తారని చెప్పలేం కానీ.. ఉన్నంతలో మంచి ఆక్యుపెన్సీలే రావచ్చని అంచనా వేస్తున్నారు. ‘మేమ్ ఫేమస్’ అనే యూత్‌ఫుల్ మూవీకి ‘మళ్ళీ పెళ్ళి’ గట్టి పోటీ ఇవ్వొచ్చని అనిపిస్తోంది. ఇలాంటి సినిమాకు ఈమాత్రం క్రేజ్ తీసుకురావడం గొప్ప విషయమే.