లక్షన్నరలో స్టార్ హీరోయిన్ పెళ్లి


ఈ రోజుల్లో పెళ్లి అంటే చిన్న స్థాయి వాళ్లకు కూడా లక్షల్లోనే ఖర్చవుతోంది. ఇక కొంచెం పెద్ద రేంజిలో ఉన్న వాళ్లయితే మంచి నీళ్ల ప్రాయంగా కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఫిలిం సెలబ్రెటీలంటే ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి కేవలం లక్షన్నర రూపాయల్లో అయిపోయిందంటే షాకవ్వక తప్పదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మహేష్ బాబు సరసన ‘అతిథి’ లాంటి భారీ చిత్రంలో నటించిన అమృతారావు.

బాలీవుడ్లో ‘వివాహ్’ సహా పలు పేరున్న చిత్రాల్లో నటించిన ఈ ముంబయి భామ.. 2016లో ఆర్జే అన్మోల్ అనే కుర్రాడిని పెళ్లాడింది. ఆమె వేరే సెలబ్రెటీల్లా ఆడంబరాలకు పోకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి అయిన ఖర్చు కేవలం 1.5 లక్షన్నర రూపాయలే అనే విషయాన్ని అమృత తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

చాలా కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో నేను, అన్మోల్ పెళ్లి చేసుకున్నాం. ఈ తంతు కోసం మేం ఖర్చు పెట్టింది లక్షన్నర రూపాయలే. పెళ్లి బట్టలు, ప్రయాణ ఖర్చులు, కళ్యాణ వేదిక, భోజనాలు.. ఇవన్నీ కూడా ఆ డబ్బుతోనే సర్దుకున్నాం. నేను ధరించిన పెళ్లి చీర ధర కేవలం 3 వేల రూపాయలు. కళ్యాణ వేదికకు కట్టిన రెంట్ రూ.11 వేలు. మిగతా వాటికి కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదు. అంతా లక్షన్నర బడ్జెట్లోనే పూర్తయింది’’ అని అమృత తెలిపింది.

2002లో ‘అబ్‌కే బరాస్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన అమృత.. హిందీలో దాదాపు పాతిక సినిమాల దాకా చేసింది. దక్షిణాదిన ఆమె నటించిన సినిమా ‘అతిథి’ మాత్రమే. రేడియో జాకీ అయిన అన్మోల్‌తో ఆమె ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి.. చివరికి 2016లో అతణ్ని పెళ్లాడింది. వీరికి వీర్ అనే బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత అమృత సినిమాలకు దూరం అయింది.