ఈ రోజుకు హైలైట్ హృతిక్ ట్వీటే..


సౌత్ హీరోలను ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. వాళ్లంటే ఒక చిన్నచూపు ఉండేది. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మన స్టార్లు బాలీవుడ్ బడా హీరోలను మించి ఎదిగిపోయారు. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టేస్తున్నాయి. దీంతో మనవాళ్లను గుర్తించక, ఎలివేషన్ ఇవ్వక తప్పని.. కలిసి పని చేయాల్సిన అవసరాన్ని కల్పించాయి మారిన పరిస్థితులు.

త్వరలోనే హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ టాప్ స్టార్.. టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్‌తో ‘వార్-2’ చేయబోతున్నట్లు కొంత కాలం కిందటే వార్త బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి ధ్రువీకరిస్తూ.. హృతిక్ ఆసక్తికర రీతిలో ఈ రోజు తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ రోజుకు తారక్‌కు వచ్చిన సోషల్ మీడియా విషెస్‌లో ఇదే హైలైట్ అనడంలో సందేహం లేదు.

‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తారక్. ఒక ఆనందకరమైన.. ఉత్సాహభరితమైన సంవత్సరాన్ని గడపాలని కోరుకుంటున్నా. నీ కోసం యుద్ధభూమిలో ఎదురు చూస్తూ ఉన్నా. మనం కలిసే వరకు నీ రోజులన్నీ సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని ఆశిస్తున్నా. పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’’ అంటూ.. చివరి వాక్యాన్ని తెలుగు మాటల్లోనే ఇంగ్లిష్‌లో టైప్ చేశాడు హృతిక్. వార్-2ను కన్ఫమ్ చేస్తూ తారక్‌కు ప్రేమగా చెప్పిన ఈ శుభాకాంక్షలు అందరినీ ఆకట్టుకున్నాయి.

తారక్ కూడా తనదైన శైలిలో ఈ ట్వీట్‌కు బదులిచ్చాడు. ‘‘నీ అందమైన శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఇక నీ రోజులు లెక్కించుకో. నీ కోసం ఏం ఎదురు చూస్తోందో తలుచుకుని నువ్వు ప్రశాంతంగా పడుకుంటూ ఉంటావనుకుంటున్నా.. త్వరలో కలుద్దాం’’ అని తారక్ పేర్కొంటూ హృతిక్‌తో వార్‌కు రెడీ అని చెప్పకనే చెప్పాడు.