విరూపాక్ష కూడా తొందపడితే ఎలా

బ్లాక్ బస్టర్ సినిమాలకు వీలైనంత ఎక్కువ థియేట్రికల్ రన్ ఉంటే వసూళ్ల శాతం బాగుంటుంది. ఎంత ఒకటి రెండు వారాల్లోనే మొత్తం పెట్టుబడి వెనక్కు వచ్చినా త్వరగా డిజిటల్ బాట పట్టడం కరెక్ట్ కాదు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. గత నెల విడుదలైన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విరూపాక్ష మే 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు అధికారికంగా కమింగ్ సూన్ సెక్షన్ లో ఆ సంస్థే ప్రకటించింది. శుక్రవారం ట్రెడిషన్ కి బదులు ఆదివారం నుంచి మీ స్మార్ట్ ఫోన్లు టీవీల్లో ఈ హారర్ థ్రిల్లర్ ని చూసుకోవచ్చు.

మార్చిలో నాని కెరీర్ బెస్ట్ గా నిలిచిన దసరా కూడా ఇదే తరహాలో నెల రోజులకే ఓటిటి బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇవి ముందస్తుగా జరిగిన ఒప్పందాల్లో భాగంగా వస్తున్నవే తప్పించి స్పందన చూశాక కూడా తీసుకున్న నిర్ణయం కాదని నిర్మాణ వర్గాలు అంటున్నాయి ఏది ఏమైనా ఇప్పటికీ విరూపాక్షకి చాలా సెంటర్స్ లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఏజెంట్, కస్టడీ లాంటివన్నీ డిజాస్టర్ కావడంతో వాటి ఫలితాలు తేజు మూవీకి సానుకూలంగా మారాయి. క్రాస్ రోడ్స్ లో ఇప్పటికీ డీసెంట్ ఫిగర్స్ నమోదవుతున్నాయి. ఇది కంటెంట్ తాలూకు స్టామినా

కారణాలు ఏవైనా ప్రొడ్యూసర్లు ఇకనైనా కనీసం నలభై అయిదు రోజుల నిడివిని పాటించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి పెద్ద సినిమాలకు ఈ గ్యాప్ నిబంధనని వర్తింపజేసి నెలన్నర తర్వాత ఓటిటిలో వచ్చేలా చూసుకున్నారు. ఇదే పద్ధతి మిగిలినవాళ్ళూ ఫాలో అయితే బాగుంటుంది. కాకపోతే ఎంత తోపు చిత్రమైనా మహా అయితే నెల రోజులకు మించి ఆడలేని పరిస్థితిలో గడువు పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అందుకే మంచి మొత్తం ఆఫర్ వస్తే నో చెప్పలేకపోతున్నామని నిర్మాతల వెర్షన్. ఇదీ రైటే