ఘాజీ దర్శకుడి ఐబి 71 ఏమయ్యింది

ఆరేళ్ళ క్రితం 2017లో ఘాజీ సినిమా తీసినప్పుడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. తక్కువ బడ్జెట్ లో అంత గ్రాండియర్ లుక్ తో దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం బాలీవుడ్ విమర్శకులను సైతం మెప్పించింది. రానాకు మరో మంచి హిట్టు దక్కింది. అయితే ఆ తర్వాత వరుణ్ తేజ్ తో స్పేస్ షిప్ బ్యాక్ డ్రాప్ లో తీసిన అంతరిక్షం మాత్రం చేదు ఫలితాన్ని అందుకోవడం సంకల్ప్ కెరీర్ కి ఒక రకంగా స్పీడ్ బ్రేక్ గా నిలిచింది. కొద్దిమందికే అర్ధమయ్యే కాన్సెప్ట్ ని సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం ఫలించలేదు. అందుకే బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది.

తాజాగా ఇతను ఐబి 71తో హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తుపాకీ విలన్, కమాండో సిరీస్ విద్యుత్ జమాల్ హీరోగా నిర్మాతగా రూపొందింది. 1971లో పాకిస్థాన్ యుద్ధ ప్రణాళికలను ముందే పసిగట్టిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ దేవ్ దాన్ని అడ్డుకునే క్రమంలో పది రోజుల మిషన్ ని రూపొందించి ముప్పై ఏజెంట్లతో శత్రుదేశం ఊహించని ఎత్తుగడలతో వాళ్ళ రహస్య పథకాన్ని చిత్తు చేస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే ఘాజీకి ముందు ఏం జరిగిందనే ప్లాట్ ని సంకల్ప్ తీసుకున్నాడు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కథా క్రమాన్ని రిజిస్టర్ చేసే క్రమంలో ఎక్కువ సమయం తీసుకున్నాడు.

దీని వల్ల చాలాసేపు అయోమయంతో కూడిన ల్యాగ్ వచ్చేసింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి గ్రిప్పింగ్ సన్నివేశాలు అక్కడక్కడా వచ్చినప్పటికీ దేశభక్తిని సరైన రీతిలో పీరియాడిక్ థ్రిల్లర్ కు మిక్స్ చేయడంలో వచ్చిన తడబాటు వల్ల ఐబి 71 తన ప్రత్యేకతను తగ్గించుకుంది. ఇలాంటి వాటిలో పండాల్సిన డ్రామా తగినంత మోతాదులో లేకపోవడంతో ఎండ్ కార్డు అయ్యాక అసంతృప్తే మిగులుతుంది. రాజీ, ఘాజీ, ఫాంటమ్ తరహాల్ ఎంగేజింగ్ కంటెంట్ ని సరిగా రాసుకుని ఉంటే మరో క్లాసిక్ మూవీ వచ్చేది కానీ సంకల్ప్ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు