గుంటూరుపై మ‌న‌సు ప‌డ్డ మ‌హేష్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కొత్త సినిమా కొన్ని రోజులుగా నెగెటివ్ విష‌యాల‌తోనే వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చింది. ఈ సినిమా కోసం ఆల్రెడీ చిత్రీక‌రించిన స‌న్నివేశాలు అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో షూట్ ఆగింద‌ని.. స్క్రిప్టు విష‌యంలోనూ మ‌ళ్లీ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు న‌డుస్తున్నాయని… అందుకే మ‌హేష్ కొత్త షెడ్యూల్ మొద‌లుపెట్ట‌కుండా ఫారిన్ ట్రిప్ వెళ్లాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

ఐతే కొన్ని రోజుల‌కు ఆ వార్త‌ల‌న్నీ స‌ద్దుమ‌ణిగాయి. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ విష‌యంలో చాలా రోజులుగా ఊహాగానాలు న‌డుస్తుండ‌గా.. కొత్త‌గా మ‌రి కొన్ని టైటిల్స్ తెర‌పైకి వ‌చ్చాయి. ఇంత‌కుముందు అమ‌రావతికి అటు ఇటు అనే టైటిల్ గురించి తెగ ప్ర‌చారం జ‌రిగింది. కానీ దాని మీద ఎక్కువ‌గా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావ‌డంతో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ మ‌న‌సు మార్చుకున్న‌ట్లు స‌మాచారం.

తాజా క‌బురేంటంటే.. ఈ సినిమా టైటిల్‌లో గుంటూరు అనే ప‌దం క‌చ్చితంగా ఉంటుంద‌ట‌. గుంటూరు కారం, గుంటూరు మిర్చి, గుంటూరు అబ్బాయి.. ఈ మూడు టైటిళ్లు ప్ర‌స్తుతం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో గుంటూరు కారం టైటిల్‌కు ఎక్కువ‌మంది మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. మిర్చి ప‌దం జోడిస్తే ప్ర‌భాస్ సినిమా టైటిల్ నుంచి తీసుకున్న‌ట్లు ఉంటుంది. అబ్బాయి అని జోడిస్తే సాఫ్ట్ అయిపోతుంది. అందుకే మాస్‌కు ఈజీగా క‌నెక్ట‌య్యేలా గుంటూరు కారం అనే టైటిల్ పెడ‌దామా అని చూస్తున్న‌ట్లు తెలిసింది.

ఇంకా ఏదీ ఖ‌రార‌వ్వ‌లేదు కానీ.. త్వ‌ర‌లోనే టైటిల్ ఓకే చేసి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ గ్లింప్స్ను లాంచ్ చేసే అవ‌కాశాలున్నాయి. ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతాన్నందిస్తున్నాడు.