హరిష్ శంకర్ ప్లానింగ్ కి అభిమానులు ఫిదా

పట్టుమని పాతిక శాతం షూటింగ్ కూడా పూర్తి కానీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ ప్లానింగ్ చూస్తే మెంటల్ మాస్ అనే పదం సరిగ్గా సరిపోతుంది. ఎప్పటికప్పుడు షూటింగ్ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ సందేహాలు తీర్చడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదంతా ఒక కోణంలో కొంచెం ఓవరనిపించినా తేరి రీమేక్ అనే పాయింట్ ని ఫ్యాన్స్ మనసులో నుంచి పూర్తిగా తుడిచేయాలంటే ఇంతకన్నా మార్గం లేదు. ఓజి విషయంలో సుజిత్ ని ఓవర్ టేక్ చేసేలా హరీష్ దూసుకుపోతున్నాడు

చిన్న వీడియో బిట్ తో కూడిన టీజర్ ని రిలీజ్ చేయడానికి ఆర్టిసి క్రాస్ రోడ్స్ సంధ్య 70 ఎంఎం థియేటర్ లో భారీ ఈవెంట్ చేయడం అందులో భాగమే. అది జరగడానికి ముందే అదిరిపోయే ఒక పోస్టర్ ని వదిలి హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ ఫస్ట్ లుక్కే వైరల్ అవుతోంది. సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విషయంలోనూ మైత్రి మూవీ మేకర్స్ ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అయ్యింది. కానీ అవి షూటింగ్ చివరి దశలో ఉండగా చేసినవి. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ జరిగింది నెలల్లో కాదు కేవలం రోజుల లెక్కలో.

ఒక అభిమానిగా గబ్బర్ సింగ్ ని మించి అవుట్ ఫుట్ ని ఉస్తాద్ రూపంలో ఇస్తానని హరీష్ పదే పదే చెప్పడం చూస్తే అభిమానుల అంచనాలు అంతకంతా పెరిగిపోతున్నాయి. దెబ్బకు హరిహరవీరమల్లు ఎవరికీ గుర్తు రావడం లేదు. వినోదయ సితం రీమేక్ బ్రో గురించి సందడి వెనుకబడే ఉంది. ఓజి కొత్త షెడ్యూల్ పూర్తయ్యేదాకా సౌండ్ ఉండదు. సో ఈ నెల మొత్తం ఉస్తాద్ సంగతులే వినిపించబోతున్నాయి. ఇంతకీ విడుదల తేదీ ఎప్పుడనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. సాయంత్రం టీజర్ తో పాటు చెబుతారో లేక త్వరలో అని సరిపెడతారో చూడాలి.