నాగార్జున 99 అయోమయం తీరలేదు

రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్లాన్ చేసుకున్న నాగార్జున 99వ సినిమా వ్యవహారం ఎంతకూ తేలడం లేదు. మలయాళం హిట్ మూవీ పోరంజు మరియం జోస్ రీమేక్ గా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ రీమేక్ హక్కుల విషయంలో ఏవో ఇబ్బందులు రావడం వల్ల రెగ్యులర్ షూటింగ్ వాయిదా వేస్తూ వెళ్లారు. నాగ్ మీద లుక్ టెస్ట్ ని నెలల క్రితమే పూర్తి చేశారు. సరే కారణం ఏదైనా విపరీతమైన ఆలస్యం జరగడంతో ఫైనల్ గా ఇది ఉంటుందా లేదానే అనుమానం నెలకొంది. దీనికి నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు

జూన్ మూడో వారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని ఇతర వివరాలు తర్వాత చెబుతామని అన్నారు. అయితే ప్రసన్న కుమార్ పేరు మాత్రం తీసుకురాలేదు. అడిగితే మళ్ళీ చెప్తామన్నారు తప్పించి స్పష్టత ఇవ్వలేదు. అంటే డైరెక్టర్ మారే అవకాశం ఉందని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టే. ఒరిజినల్ వెర్షన్ నుంచి కేవలం కొంత భాగమే తీసుకున్నామని ఎన్నో మార్పులతో దానికి పోలిక లేకుండా ఉంటుందని మరో న్యూస్ చెప్పారు. ఈ లెక్కన నోటి దాకా వచ్చిన బిర్యానీ చేజారిపోయినట్టు డెబ్యూనే నాగార్జున లాంటి సీనియర్ స్టార్ తో ప్లాన్ చేసుకున్న ప్రసన్నకు ఇది షాకే అవుతుంది

ఇంకో నెల రోజులు టైం ఉంది కాబట్టి అనౌన్స్ మెంట్ కోసం వేచి చూడాలి. ఇన్ సైడ్ టాక్ అయితే నాగ్ స్క్రిప్ట్ పట్ల చాలా నిక్కచ్చిగా ఉన్నారని, వరస డిజాస్టర్ల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారట. అందుకే నెలలు గడిచిపోతున్నా సినిమా మొదలుపెట్టేందుకు తొందరపాటు ప్రదర్శించకుండా కూల్ గా ఉన్నారు. నాగార్జునకు స్నేహితుడిగా ఇందులో అల్లరి నరేష్ నటించబోతున్నాడు. కథ మొత్తం కేంద్రీకృతమయ్యే కీలకమైన హీరోయిన్ ని ఎవరిని తీసుకుంటారోననే సస్పెన్స్ ఇంకా తేలలేదు. దీనికోసం పెద్ద కసరత్తే జరుగుతోంది