అఖిల్-యువి.. ముందుకే

అఖిల్‌తో పాటు అక్కినేని ఫ్యామిలీ, అలాగే అభిమానులు ‘ఏజెంట్’ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అఖిల్ కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్, మాస్ ఇమేజ్ వచ్చేస్తుందని అంచనాలు కట్టారు. తీరా చూస్తే.. అఖిల్ కెరీర్లోనే కాక టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందా చిత్రం.

ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘ఏజెంట్’ ఇచ్చిన హై వల్ల తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని అయోమయంలో ఉన్నట్లు అఖిల్ చెప్పాడు. అప్పుడు పాజిటివ్ సెన్స్‌లో ఆ మాట చెప్పినా.. ఇప్పుడు ‘ఏజెంట్’ డిజాస్టర్ కావడంతో తర్వాత ఏం చేయాలో పాలుపోని స్థితిలో అతనున్నాడు. కాగా ‘ఏజెంట్’ పెద్ద హిట్టవుతుందని అందరూ నమ్ముతున్న టైంలో అఖిల్‌తో ఓ సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేసింది.

సాహో, రాధేశ్యామ్ చిత్రాలకు ఈ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనిల్ అనే కుర్రాడిని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నారు. కానీ ‘ఏజెంట్’ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ ఫలితం ఆధారంగా యువి వాళ్లలో ఎలాంటి మార్పు రాలేదట.

ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికే చూస్తున్నారట. అంతే కాక ఈ చిత్రం కోసం ‘ధీర’ అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ‘ఏజెంట్’ విడుదలకు ముందే ఈ సినిమా కోసం అఖిల్ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తారని.. కొన్ని నెలల్లో ప్రి ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తారని సమాచారం.