తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత గాథను వెండితెరపైకి తేవడమే అని దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో ఏళ్ల కిందటే ప్రకటించాడు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలను ‘మహాభారతం’ తీయడానికి ముందు తనకు తాను పెట్టుకుంటున్న పరీక్షలా.. ఒక ట్రయల్ లాగా చెబుతూ వస్తున్నాడు జక్కన్న. బాహుబలి మొదలైన సమయంలోనే ‘మహాభారతం’ గురించి ప్రస్తావించి.. అది తీయడానికి తనకు పదేళ్ల అనుభవం కావాలని పేర్కొన్నాడాయన. చూస్తుండగానే దాదాపు పదేళ్లు గడిచిపోయాయి. కానీ ఇంకా ‘మహాభారతం’ పనులు మొదలుకాలేదు. ప్రస్తుతానికి జక్కన్న దృష్టి.. మహేష్ బాబుతో తీయబోయే సినిమా మీదే ఉంది. మరి దీని తర్వాత అయినా ‘మహాభారతం’ మొదలుపెడతాడా అనే విషయంలో స్పష్టత లేదు. ఐతే తాను ఈ సినిమా తీస్తే పది భాగాలుగా ఉంటుందని రాజమౌళి సంకేతాలు ఇవ్వడం విశేషం.
రాజమౌళి పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమంలో భాగంగా ‘మహాభారతం’ గురించి ప్రస్తావన వచ్చింది. టీవీలో ఆ కథను 260కి పైగా ఎపిసోడ్లుగా తీశారని.. మరి మీరు సినిమాగా తీస్తే అది ఎన్ని భాగాలుగా ఉంటుందని రాజమౌళికి ఒక వ్యక్తి ప్రశ్నించారు. దీనికి జక్కన్న బదులిస్తూ.. ‘‘మహాభారతం మీద ఇండియాలో వచ్చిన అన్ని వెర్షన్లనూ చదవడానికే ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతుంది. నోట్స్ ఏమీ రాసుకోకుండా.. కేవలం చదవడానికి మాత్రమే అంత సమయం పడుతుంది. ఇక ఆ సినిమా తీస్తే పది భాగాలుగా తీయాల్సి ఉంటుందని నా అంచనా’’ అని తెలిపాడు. మహాభారత కథకు ఉన్న విస్తృతి దృష్ట్యా.. రాజమౌళి ఆ సినిమా తీస్తే నాలుగైదు భాగాలైనా ఉంటుందని అనుకున్నారు. కానీ ఏకంగా పది భాగాలుగా తీయాల్సి ఉంటుందన్న జక్కన్న మాటతో ఇది ఎంత మెగా ప్రాజెక్టో అర్థమవుతుంది. మహేష్ బాబు సినిమాను పూర్తి చేసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినా.. తన జీవిత కాలంలో ఇంకో సినిమా తీయకుండా దీనికే జక్కన్న అంకితం అయిపోవాల్సి ఉంటుందేమో.