లోకకళ్యాణం కోసం ఆదిపురుషుడి యుద్ధం

అంచనాలను ఆకాశంలో మోస్తున్న ఆది పురుష్ మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. నిన్న హైదరాబాద్ ఏఎంబిలో ట్రైలర్ ని ప్రీమియర్ చేశాక దాన్నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉండటంతో మిస్సయిన అభిమానులు ఆన్ లైన్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. అయితే సెల్ ఫోన్స్ ఎంత కట్టడి చేసినా లీకుల రూపంలో బయటికి వచ్చేయడంతో సాయంత్రం ప్లాన్ చేసుకున్న యూట్యూబ్ రిలీజ్ కాస్తా మధ్యాన్నానికి మార్చేశారు. థియేటర్లలో మాత్రం అయిదు గంటల తర్వాతే ఉంటుంది. ఇంతకీ టీజర్ తో వచ్చిన నెగటివిటీ పోయేలా ట్రైలర్ ని ఆకట్టుకునేలా మార్చారా లేదా

హనుమాన్ మాటల్లో కథ మొదలవుతుంది. మనం గతంలో ఎన్నోసార్లు చూసిందే విన్నదే అయినా టెక్నాలజీ సాయంతో సరికొత్త రామాయణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సీతాపహరణం, రామలక్ష్మణుల సోదర బంధం, శబరీ ఎంగిలి పళ్ళ ఆరగింపు, లంకా దహనం, సీతమ్మ అంగుళీక ఘట్టం, శివుడి కృప కోసం రావణాసురుడి ఘోర తపస్సు ఇవన్నీ మూడు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల సుదీర్ఘమైన ట్రైలర్ లో పొందుపరిచారు. ప్రభాస్, కృతి, సైఫ్ లుక్స్ తో పాటు ఇతర పాత్రధారులు టీజర్ కన్నా చాలా బెటర్ గా కనిపించారు. ఆ విషయంలో శ్రద్ధ కనిపించింది

విజువల్స్ బాగున్నాయి. త్రీడిలో ఆస్వాదించే విధంగా రామలీలను తీర్చిదిద్దారు. భవిష్యత్తు తరాలు బంధాల గొప్పదనం తెలుసుకోవడం కోసం యుద్ధం చేయాలనే రాముడి సందేశం కొత్త కోణంలో సాగింది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అయినా సహజత్వం తీసుకురావడంలో టీమ్ కష్టపడింది. అత్యుత్తమ గ్రాఫిక్స్ అనే మాట పూర్తి సినిమా చూశాక తప్ప ముందే చెప్పలేం. ప్రస్తుతానికి అంచనాలు పెంచడంలో టి సిరీస్ సంస్థ విజయవంతమయ్యింది. జై శ్రీరామ్  నినాదంతో అజయ్ అతుల్ నేపధ్య సంగీతం కార్తీక్ పళని ఛాయాగ్రహణం స్టాండర్డ్స్ ని పెంచాయి. జూన్ 16న ఆగమిస్తున్న ఆదిపురుష్ ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో