నటులు దర్శకులు కావడం కొత్తేమీ కాదు. ఐతే పర్టికులర్‌గా కమెడియన్లు డైరెక్టర్లు కావడం మాత్రం అరుదే. గతంలో ఎమ్మెస్ నారాయణ లాంటి కొంతమంది ఈ ప్రయత్నం చేశారు. తన కొడుకునే హీరోగా పెట్టి ఆయన సినిమా తీయడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరో సీనియర్ కమెడియన్ పృథ్వీ ఇదే పని చేస్తున్నారు.
కాకపోతే ఆయన తన కొడుకును పెట్టి సినిమా తీయట్లేదు. కూతురిని హీరోయిన్ని చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు.. శ్రీలు అట. తన గురించి న్యూస్ ఇప్పుడే బయటికి వచ్చింది. ఆమె లీడ్ రోల్ చేస్తున్న సినిమా పేరు.. కొత్త రంగుల ప్రపంచం. ఈ సినిమాలో క్రాంతి అనే కుర్రాడు హీరోగా నటిస్తున్నాడు. తన కూతురు కాబట్టి ఈ చిత్రంలో తనకు పృథ్వీ అవకాశం ఇవ్వలేదని.. ఆ పాత్రకు సరిపోతాననే ఛాన్స్ ఇచ్చారని అంటోంది శ్రీలు.
తన తండ్రితో అనుబంధం.. ఆయన దర్శకత్వం చేయడం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘నాన్న ఓ చిత్రం డైరెక్ట్ చేయబోతున్నారని నాకు తెలియదు. ముందుగా హీరో క్రాంతిని సెలెక్ట్ చేసిన తర్వాతే నన్ను ఎంపిక చేశారు. ఆయన కుమార్తెగా నాకు ఈ అవకాశం ఇవ్వలేదు. ఆ పాత్రకు నేను సరిపోతానని నాన్నకి నమ్మకం కుదిరిన తర్వాతే నన్ను తీసుకున్నారు. నాన్న ప్రతిభ ఏంటో ఈ సినిమాలో తెలుస్తుంది. ఒక నటుడిగా నాన్నని ఎంతో ఇష్టపడతా. ఆయన పాత్రలని చాలాసార్లు ఎంజాయ్ చేశా. కానీ నాన్న చేసే రాజకీయం నాకు నచ్చదు. నాన్నకి పాలిటిక్స్ వద్దని చెప్పలేను. ఎందుకంటే పాలిటిక్స్ నాన్నకి ఇష్టం. ఇండస్ట్రీలో నీ ముందు వెనుక చాలా జరుగుతుంటాయి. అవేమి పట్టించుకోవద్దు.. నీ పని నువ్వు చేసుకో అని నాన్న నాకు సలహా ఇచ్చారు. ఇండస్ట్రీలో ఆయనే నాకు ఇన్సిపిరేషన్” అని శ్రీలు తెలిపింది.