తెలుగు సినిమాల్లో కామెడీ స్వరూపమే మారిపోయింది గత దశాబ్ద కాలంలో. ఒకప్పుడు బ్రహ్మానందం మొదలుకుని.. ఎమ్మెస్ నారాయణ, సునీల్, వేణుమాధవ్, మల్లికార్జునరావు, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్, జయప్రకాష్ రెడ్డి, కొండవలస లక్ష్మణరావు.. ఇలా ఎంతోమంది కమెడియన్లతో తెలుగు సినిమా కామెడీ పరంగా వైభవం చూసింది. కానీ ఇందులో చాలామంది కమెడియన్లు కాలం చేశారు. మిగతా వాళ్లు కామెడీ మానేశారు.
ఇప్పుడు కామెడీ రాసేవాళ్లు.. తీసేవాళ్లు తగ్గిపోయారు. ఒకప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన కామెడీ.. ఇప్పుడు ఔట్ డేటెడ్ అనుకునే పరిస్థితి వచ్చింది. కమెడియన్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడు కామెడీ స్టైల్ కూడా మారిపోయింది. ఇంతకుముందు కామెడీ అంటేనే ఓవర్ ద టాప్ అన్నట్లు ఉండేది. ఎంత అతి చేస్తే అంత బాగా కామెడీ పండేది. కానీ ఇప్పుడు కామెడీ కూడా ‘సటిల్’గా మారింది. ఈ తరం ప్రేక్షకులు సింపుల్ కామెడీనే ఇష్టపడుతున్నారు.
ప్రస్తుతం వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి కమెడియన్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. అలా అని వీరికి కూడా ఒకప్పటి కమెడియన్ల స్థాయిలో లాంగెవిటీ కనిపించడం లేదు. ప్రియదర్శి ముందులా కామెడీ చేయట్లేదు. సీరియస్ సినిమాలు, అందులోనూ లీడ్ రోల్స్ చేస్తున్నాడు. రాహుల్ కూడా పూర్తి స్థాయిలో కామెడీ చేయట్లేదు. కిషోర్ ఒక్కడు నిలకడగా కామెడీ చేస్తున్నాడు. అతణ్ని కూడా ఈ మధ్య రైటర్లు, డైరెక్టర్లు సరిగా వాడుకోవట్లేదు.
ఇలా సినిమాల్లో కామెడీ రోజు రోజుకూ తగ్గిపోతున్న టైంలో ఒక టాలెంటెడ్ కమెడియన్ని తెలుగు సినిమా సరిగా వాడుకోలేకపోతోంది. అతనే.. అభినవ్ గోమఠం. ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా లాంటి సినిమాలు చూస్తే అభినవ్ టాలెంట్ ఎంటో అర్థమవుతుంది. ఎక్కువ హడావుడి చేయకుండా సటిల్ యాక్టింగ్‌తో అతను కడుపుబ్బ నవ్వించగలడు. ఈ తరం ప్రేక్షకులు అతడితో బాగా కనెక్ట్ అవుతారు. తన టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా అనిపిస్తాయి.
ఇటీవలే ‘సేవ్ ద టైగర్స్’ అనే వెబ్ సిరీస్ చూస్తూ అభినవ్ టాలెంట్ ఏంటో మరోసారి అర్థమవుతుంది. ఈ సిరీస్‌కు మేజర్ హైలైట్ అతనే. అది చూశాక తన టాలెంట్‌ను టాలీవుడ్ సరిగా వాడుకోలేకపోతోందని అర్థమవుతుంది. ఇప్పటికైనా అతడి ప్రతిభకు తగ్గ పాత్రలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.