ఇళయరాజా తమిళుడే కావచ్చు కానీ.. తెలుగువారిలో కోట్ల మంది ఆయన సంగీతానికి చెవి కోసుకుంటారు. 80, 90 దశకాల్లో ఆయన అందించిన అద్భుతమైన ఆల్బమ్స్ ఇప్పటికీ తెలుగు వారి ఇళ్లలో మార్మోగుతూనే ఉంటాయి. ఒక టైంలో తమిళ సినిమాలను మించి తెలుగులో గొప్ప గొప్ప పాటలు ఇచ్చారు ఇళయరాజా.
అందుకే ఆయనకు ఇక్కడ కోట్ల మంది డైహార్డ్ ఫ్యాన్స్‌గా మారిపోయారు. వాళ్లందరిలోనూ ఇళయరాజా మీద అభిమానాన్ని మించి ఒక భక్తి భావం కనిపిస్తుంది. ఇళయరాజా ఇక్కడ ఏదైనా ఈవెంట్‌కు హాజరైనా, కన్సర్ట్ లాంటిది చేసినా.. తమ అభిమానం అంతా చూపిస్తుంటారు.
తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇళయరాజాపై తన గౌరవ భావాన్ని చాటారు. తాను సంగీతం అందించిన ‘మ్యూజిక్ స్కూల్’ అనే ఓ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఇళయరాజా హైదరాబాద్ వచ్చారు. ఈ వేడుకకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఇళయరాజా గారితో కలిసి ఈ వేదికను పంచుకోవడం ఒక గౌరవం. సార్ ఒప్పుకుంటే ఆయన ఆధ్వర్యంలో తెలంగాణలో ఒక సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. అనంతరం ఇళయరాజా మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర మంత్రే యూనివర్శిటీ ఏర్పాటు చేయమని చెబితే కాదని ఎలా అంటాను? ఆయన అన్నట్లు మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటైతే 200 మంది ఇళయరాజాలు జనం నుంచి వస్తారు’’ అని అన్నారు.
ఐతే ఇలాంటి మాటలు చాలా వరకు నీటి మీద రాతలు అవుతుంటాయి. తర్వాత కేటీఆర్, ఇళయరాజా కూడా ఈ విషయాన్ని మరిచిపోతారేమో. కానీ ఇద్దరూ సీరియస్‌గా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం నిజంగా మ్యూజిక్ యూనివర్శిటీ లాంటిది ఏర్పాటు చేస్తే.. దాన్ని ఇళయరాజా ముందుండి నడిపిస్తే ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో అదొక విప్లవంలా మారడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates