ఇండియాలో కమర్షియల్ సినిమాలను వేరే లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత మెగాస్టార్ చిరంజీవికి ఉంది. కెరీర్లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేసినప్పటికీ.. ఒకప్పుడు ఆయన రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్భావంధవుడు లాంటి కథా బలం ఉన్న, తన నటనా కౌశలాన్ని చాటే అవకాశమున్న సినిమాలు చేశారు. కానీ తర్వాత తర్వాత ఆయన పూర్తిగా మాస్ మసాలా సినిమాలకే పరిమితం అయిపోయారు.
ప్రేక్షకులు తనను ఇలాంటి సినిమాల్లోనే చూడాలనుకుంటారని.. రుద్రవీణ లాంటి సినిమాలు చేస్తే డబ్బులు రావని గతంలో సమర్థించుకునేవారు చిరు. ఐతే ఇప్పుడు చిరు వయసు పెరిగింది. ఇమేజ్ మారింది. ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ కమర్షియల్ బాట వీడట్లేదు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో సైతం చిరు వరుసగా పక్కా కమర్షియల్ సినిమాలే చేస్తున్నారు. కమర్షియల్ హంగులతోనే వైవిధ్యం చూపించే సుకుమార్, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లతోనూ ఆయన పని చేయట్లేదు. అదే సమయంలో హను రాఘవపూడి, వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్, గౌతమ్ తిన్ననూరి లాంటి మంచి అభిరుచి ఉన్న యువతరం దర్శకుల వైపూ చూడట్లేదు.
వెంకీ కుడుములతో సినిమా క్యాన్సిల్ అయ్యాక చిరు.. కళ్యాణ్ కృష్ణ కురసాల, వశిష్ఠ లాంటి కమర్షియల్ డైరెక్టర్ల వైపే చూస్తున్నాడు కానీ.. పైన చెప్పుకున్న దర్శకులెవరూ ఆయన లైన్లోకి రాలేకపోతున్నారు. ఇంతకుముందులా ఇమేజ్ బ్యాగేజ్ ఏమీ లేని నేపథ్యంలో చిరు ఇప్పుడైనా డిఫరెంట్ సినిమాలు తీసే యువ దర్శకుల వైపు చూస్తే, ప్రమోగాత్మక చిత్రాలు చేస్తే బాగుంటుందని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆశిస్తున్నారు.