అల్లరి నరేష్‌కు అదే ప్లస్

ఒకప్పుడైతే సినిమా బాగుంటే చూసేవాళ్లు. లేదంటే లేదు. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే.. హీరో, డైరెక్టర్, హీరోయిన్, ప్రొడ్యూసర్ వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్లు అన్న దాన్ని బట్టి కూడా దాని ఫలితాన్ని నిర్దేశిస్తున్నారు. వ్యక్తిగతంగా వాళ్ల మీద ఉన్న అభిప్రాయాలను బట్టి సోషల్ మీడియాలో అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు పడుతున్నాయి.

జనాల దృష్టిలో సరైన అభిప్రాయం లేని ఆర్టిస్టుల సినిమాలను సోషల్ మీడియాలో అదే పనిగా టార్గెట్ చేయడం జరుగుతోంది. అలాగే సినిమాలు చూసే విషయంలోనూ.. అందులో ఇన్వాల్వ్ అయిన వారి మీద ఉన్న వ్యక్తిగత అభిప్రాయం కీలకంగా మారుతోంది. కొందరి సినిమాలు బాగున్నా కూడా ఆడకపోవడానికి వారి మీద వ్యక్తిగతంగా నెగెటివిటీ పెరిగిపోవడం కారణం. అదే సమయంలో కొందరు హీరోల మీద మెజారిటీ జనాల్లో సానుకూల అభిప్రాయం ఉండి.. సినిమాలకు అది ప్లస్ అవుతూ ఉంటుంది.

అలాంటి కోవకు చెందిన హీరోనే అల్లరి నరేష్. టాలీవుడ్లో అసలు నెగెటివిటీ అంటూ లేని హీరోల్లో నరేష్ ముందు వరసలో ఉంటాడు. ఒకప్పుడు తన కామెడీ సినిమాలతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడనే సానుకూల అభిప్రాయం అతడి మీద అందరిలోనూ ఉంది. బేసిగ్గానే కమెడియన్లు, కామెడీ సినిమాలు చేసే హీరోల మీద జనాలకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఒకే రకమైన మూస కామెడీతో విసిగించేయడంతో అతడి సినిమాలు ఒక దశలో వరుసగా ఫెయిలయ్యాయి. కానీ తనకు హిట్ పడాలని కోరుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. కామెడీ ఇమేజ్ పక్కన పెడితే.. సీరియస్‌గా, సిన్సియర్‌గా ‘నాంది’ అనే ఒక సినిమా చేస్తే దాన్ని ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. నిజానికి మొదట్లో వచ్చిన టాక్‌ను బట్టి చూస్తే అది అంత పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా కాదు.

ఇప్పుడు ‘ఉగ్రం’ అనే సినిమాకు కూడా యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాకు సాయంత్రానికి వసూళ్లు బాగా పుంజుకున్నాయి. సినిమా గురించి ఎవ్వరూ నెగెటివ్‌గా మాట్లాడకపోవడం నరేష్ మీద ఉన్న సానుకూల అభిప్రాయమే కారణం. యావరేజ్ టాక్ కాస్తా హిట్ టాక్‌గా మారి.. సినిమా రెండో రోజు బాక్సాఫీస్ దగ్గర బాగా పెర్ఫామ్ చేస్తోంది. జనాల్లో వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం కలిగి ఉండటం ఎంత కీలకం అన్నది ఇలాంటి సినిమాల ఫలితాలు చూస్తే అర్థమవుతుంది.