కుమ్మేస్తున్న కేర‌ళ స్టోరీ

గ‌త ఏడాది ది క‌శ్మీర్ ఫైల్స్ అనే చిన్న హిందీ సినిమా రేపిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్నందుకుందా చిత్రం. 15-20 కోట్ల మ‌ధ్య బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా మూణ్నాలుగొంద‌ల కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం అంటే చిన్న విష‌యం కాదు. క‌శ్మీర్లో క‌శ్మీరీ పండిట్ల‌పై జ‌రిగిన దురాగ‌తాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్రాపగంగా ఫిలిం అని, ముస్లింల‌పై విషం చిమ్మేందుకు భాజపానే వెనుక ఉండి ఈ సినిమాను తీయించింద‌ని ప్ర‌తిప‌క్షాలు ఎంత ఆరోపించినా.. ప్రేక్ష‌కులు మాత్రం ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడు ది కేర‌ళ స్టోరీ అనే మ‌రో సినిమా కూడా అలాగే సంచ‌ల‌నం రేపేలా క‌నిపిస్తోంది.

ఇది కూడా క‌శ్మీర్ ఫైల్స్ లాంటి సినిమానే. కాక‌పోతే నేప‌థ్యం కేర‌ళ‌కు మారింది. అక్క‌డ ల‌వ్ జిహాదీ పేరుతో హిందు, ఇత‌ర మ‌తాల అమ్మాయిల్ని ఇస్లాంలోకి మార్చి.. వారిని ప‌ర‌దేశాల‌కు త‌ర‌లించి హింసించ‌డం, ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు వాడుకోవ‌డం గురించి హార్డ్ హిట్టింగ్‌గా తీసిన సినిమా ఇది. ట్రైల‌ర్‌తో తీవ్ర వివాదాల‌కు దారి తీసిన ఈ చిత్రం శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కేర‌ళ స‌హా కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాను వ్య‌తిరేకించాయి. కొన్ని చోట్ల నిషేధాజ్ఞ‌లు విధించారు. స్వ‌చ్ఛందంగా షోలు ఆపేసిన వాళ్లూ ఉన్నారు. కానీ ఇవేవీ ప్రేక్ష‌కుల ఆస‌క్తి మీద ప్ర‌భావం చూప‌లేదు. సినిమా రిలీజైన ప్ర‌తి చోటా హౌస్ ఫుల్స్ ప‌డిపోతున్నాయి.

హైద‌రాబాద్ విష‌యానికే వ‌స్తే మ‌ల్టీప్లెక్సులన్నీ శుక్ర‌వారం ప్యాక్డ్ హౌస్‌ల‌తో న‌డుస్తున్నాయి. టికెట్లు దొర‌క‌డం క‌ష్ట‌మ‌య్యే ప‌రిస్థితి త‌లెత్తింది. మిగ‌తా మేజ‌ర్ సిటీస్ అన్నింట్లోనూ కేర‌ళ స్టోరీకి మంచి ఆక్యుపెన్సీలు క‌నిపిస్తున్నాయి. దీన్ని కూడా ప్రాపగండా ఫిలింగా ముద్ర వేసినా స‌రే.. ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఈ సినిమా చూడాల‌నే ఆస‌క్తి బాగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. క‌శ్మీర్ ఫైల్స్ స్థాయిలో కాక‌పోయినా ఇది కూడా భారీ విజ‌య‌మే సాధించేలా ఉంది.