మనోబాల నిజంగా అంత గొప్పవారా

ఇవాళ అనారోగ్యంతో కన్నుమూసిన మనోబాల మృతి పట్ల తమిళ పరిశ్రమ తీవ్ర విషాదంలో ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఒక నటుడిగానే ఈయన పరిచయం. మొన్న సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యలో కొద్దినిమిషాల పాటు జడ్జ్ పాత్రలో కనిపించి మెప్పించారు. టాలీవుడ్ కు సంబంధించి అదే ఆయన ఆఖరి చిత్రం. అయితే చాలా మందికి అవగాహన లేనంత మాత్రాన మనోబాలని తక్కువగా చూడలేం. కొన్ని విషయాలు తెలుసుకుంటే గొప్పదనం అర్థమవుతుంది. తన అసలు పేరు బాలచందర్. అప్పటికే ఆ పేరుతో ఓ డైరెక్టర్ ఉండటంతో మార్చుకోవాల్సి వచ్చింది.

మనోబాల పరిశ్రమకు వచ్చింది దర్శకుడు కావాలనే లక్ష్యంతో. 1975 ప్రాంతంలో కమల్ హాసన్ రిఫరెన్స్ తో భారతి రాజా వద్ద అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కువ సమయం పట్టకుండానే 1982లో ఆగయ గంగైతో దర్శకుడిగా మారారు. అయితే అది సక్సెస్ కాలేదు. నటుడిగా అవకాశాలు రావడంతో రమణారెడ్డిలా కనిపించే రూపం మంచి కమెడియన్ వేషాలను తీసుకొచ్చింది. అయితే డైరెక్టర్ సంకల్పాన్ని పక్కన పెట్టలేదు. మూడేళ్ళ తర్వాత తిరిగి మెగా ఫోన్ పట్టుకుని చేసిన నాన్ ఉంగళ్ రసిగన్, పిల్లై నిలా హిట్ అయ్యాయి మళ్ళీ ఛాన్సులు తీసుకొచ్చాయి.

అక్కడి నుంచి ఒకపక్క వేషాలు వేస్తూనే దర్శకుడిగా 24 సినిమాలు తీశారు. రజనీకాంత్, విజయ్ కాంత్, ప్రభు, సత్యరాజ్ లాంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేసి ఎన్నో హిట్లు అందుకున్నారు. నిర్మాతగా సతురంగ వెట్టై ఘన విజయం సాధ్హించింది. దీన్నే తెలుగులో సత్యదేవ్ తో బ్లఫ్ మాస్టర్ గా శివలెంక కృష్ణప్రసాద్ రీమేక్ చేశారు. ప్రొడ్యూసర్ గా మనోబాల మూడు సినిమాలు తీయగా పలు సీరియల్స్ లో కీలక భూమిక పోషించారు. తెలుగులో గగనం, రాజ్ దూత్, దేవదాస్, మహానటి లాంటి వాటిలో తళుక్కున మెరిశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిజంగానే ఆయన సాధించిన శిఖరాలు పెద్దవే.