బన్నీతో సురేందర్ రెడ్డి?

ఈ హెడ్డింగ్ చూసి చాలామంది ఉలిక్కి పడి ఉండొచ్చు. ‘ఏజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిని అల్లు అర్జున్ నమ్మడమా అని ఆశ్చర్యం కలగొచ్చు. టాలీవుడ్లో సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుని.. ఎంతో జాగ్రత్తగా కొత్త ప్రాజెక్టును సెట్ చేసుకునే హీరో బన్నీ. తన సక్సెస్ రేట్ చూస్తేనే మంచి జడ్జిమెంట్ ఉన్న హీరో అని అర్థమవుతుది. అలాంటి హీరో ‘ఏజెంట్’ లాంటి సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో జట్టు కడతాడంటే నమ్మబుద్ధి కాదు. అసలు సురేందర్ బన్నీని ఈ టైంలో రీచ్ అవడం సాధ్యమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది.

కానీ ఒకప్పుడు ‘రేసు గుర్రం’ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా సురేందర్ మీద బన్నీకి అభిమానం, కృతజ్ఞత ఉన్నాయి. అందువల్లే ‘ఏజెంట్’ రిలీజ్ కంటే ముందు సురేందర్‌తో సినిమా చేసే విషయమై సానుకూలంగా స్పందించాడట.

కాకపోతే అంతిమ నిర్ణయం స్క్రిప్టు ఆధారంగానే ఉంటుంది. తనను మెప్పించే స్క్రిప్టుతో వస్తే సినిమా చేయడానికి సిద్ధం. ‘ఏజెంట్’ రిలీజ్ తర్వాత కూడా బన్నీ ఆలోచన ఏమీ మారలేదట. కథ మీద పని చేయమని సురేందర్‌కు చెప్పాడు. అతను తన టీంతో కలిసి ఆ పనిలోనే ఉన్నాడు. ‘ఏజెంట్’ సురేందర్‌ను పెద్ద షాక్‌కు గురి చేసి, బాగా డిస్టర్బ్ చేసినప్పటికీ.. దాన్నుంచి బయటికి వచ్చి బన్నీని మెప్పించే ప్రయత్నం చేయాలని ఫిక్సయ్యాడట. కాకపోతే ఇల్లు అలగ్గానే పండగ కాదు అన్నట్లు, బన్నీ కథ మీద పని చేయమని అన్నంతమాత్రాన సినిమా చేసేస్తున్నట్లు కాదు. బన్నీతో సినిమా అంటే అల్లు అరవింద్, బన్నీ వాసు లాంటి వాళ్లను కూడా మెప్పించాల్సి ఉంటుంది. బన్నీ దగ్గర కూడా స్క్రుటినీ గట్టిగా జరుగుతుంది. ఇన్ని దశలు దాటుకుని సినిమాను పట్టాలెక్కించాలంటే ఆషామాషీ విషయం కాదు.

గతంలో విక్రమ్ కుమార్, వేణు శ్రీరామ్ లాంటి వాళ్లు కొన్ని నెలల పాటు బన్నీతో ట్రావెల్ అయి.. తర్వాత అవకాశం దక్కక వేరే సినిమాలు చూసుకున్నారు. కాబట్టి సురేందర్.. బన్నీని మెప్పించాలంటే చాలా కష్టపడాల్సిందే.