ఆంధ్రప్రదేశ్ రాజకీయం సినిమా రంగు పులుముకుని రంజుగా మారుతోంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొగడ్డంపై వైసీపీ శ్రేణులు ఎంత తీవ్రంగా స్పందించాయో తెలిసిందే. అందుకు బదులుగా టీడీపీ వాళ్లతో పాటు న్యూట్రల్ జనాలు కూడా వైసీపీ తీరును తూర్పార పడుతున్నారు.
ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వ హయాంలో నంది అవార్డులు కుల ప్రాతిపదికన ఇచ్చేవారంటూ వైసీపీ మద్దతుదారు అయిన పోసాని కృష్ణమురళి కొన్ని రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు తెలుగుదేశం సపోర్టర్ అయిన సీనియర్ నిర్మాత అశ్వినీదత్ ఘాటుగా బదులిచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన మైల్ స్టోన్ మూవీ మోసగాళ్లకు మోసగాడు సినిమా రీరిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో దత్‌కు నంది అవార్డుల గురించి ప్రశ్న ఎదురైంది.
దీనికి ఆయన బదులిస్తూ.. ”ఇప్పుడేంటంటే ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు కదా. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ ఆళ్లకిస్తారు. సినిమాలకు ఇచ్చే రోజులు మళ్లీ రెండు మూడేళ్లలో వస్తాయి. అప్పుడు ఘనంగా ఇస్తారు. మనందరికీ అవార్డులు వస్తాయి” అనిఅశ్వినీదత్ వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్ సర్కారును ఉద్దేశించే దత్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా దత్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే పోసాని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దత్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా రజినీకాంత్ ప్రస్తావన కూడా తెచ్చారు.
”ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అని కాదు మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్ ఉత్తమ మోసగాడు అవి కదా ఇవ్వాలి. ఉత్తమ వేదవలు ఉత్తన సన్యాసులు అని మీ వాళ్ళకే ఇవ్వాలి. రజనీకాంత్ రోజు చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబు ను పొగుడు కొమ్మను మాకు అభ్యంతరం లేదు. అతను చెన్నై లో సూపర్ స్టార్ తెలుగు వాళ్లకు కాదు. మాకు సూపర్ స్టార్ వున్నారు ఆయనే చిరంజీవి. ఆయనకు జగన్ గారు అంటే ఎంతో ప్రేమ అలాగే చిరంజీవి అంటే అన్న అన్న అంటు వైఎస్సార్ గారికి ఇచ్చినంత గౌరవం ఇస్తారు జగన్ గారు” అని పోసాని పేర్కొన్నారు.