మెచ్చుకోలు సరే వసూళ్లు ఎక్కడ

మణిరత్నం మ్యాగ్నమ్ ఓపస్ గా చెప్పుకున్న పొన్నియిన్ సెల్వన్ 2కి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కల్ట్ ఫిలిం మేకింగ్ ని ఇష్టపడేవాళ్లు థియేటర్లో చూసి ఆస్వాదించారు. అయితే తెలుగు బాక్సాఫీస్ దగ్గర మాత్రం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. పీఎస్ 1కి ఏదైతే ఫలితం దక్కిందో మళ్ళీ అదే రిపీటవ్వడం ఖాయమని బయ్యర్ల మాట. మూడు రోజులకు గాను 4 కోట్ల దాకా షేర్ రాబట్టిన ఈ వార్ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాలంటే ఆరు కోట్ల షేర్ రాబట్టాలి. అంటే గ్రాస్ పదిహేను దాకా రావాల్సి ఉంటుంది. ఇది ఈజీ కాదు.

ఏజెంట్ తో పోల్చుకుంటే చాలా చాలా బెటరనే ఊరట తప్ప పీఎస్ 2కు దక్కిందేమీ లేదు. సమస్యల్లా సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా మాసోడికి కిక్కిచ్చేలా పూర్తి స్థాయి అంశాలు ఇందులో లేకపోవడమే. ఈ మాత్రం ఆడియన్స్ వస్తున్నారంటే దాని కారణం కలర్ ఫుల్ క్యాస్టింగ్. విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్,జయం రవి, శోభిత, ఐశ్వర్య లక్ష్మి ఇలా పేర్లు బడ్జెట్ లు చూసి టికెట్లు కొంటున్నారు. కానీ బయటికి వచ్చాక అబ్బో అద్భుతంగా ఉంది మళ్ళీ మళ్ళీ చూడాలనే మాట పెద్దగా వినిపించడం లేదు. సోషల్ మీడియా పొగడ్తలయితే గట్టిగానే వచ్చాయి

తమిళనాడులో పొన్నియిన్ సెల్వన్ 2 దున్నేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే దూకుడు తగ్గినప్పటికే వీకెండ్ నాటికి యాభై నాలుగు కోట్ల మార్కుని దాటేసింది. అయితే పీఎస్ 1 రికార్డులు బ్రేక్ చేయడం సాధ్యం కాకపోవచ్చని టాక్. బాహుబలి రేంజ్ లో పబ్లిసిటీ చేసుకున్నా రిజల్ట్ విషయంలో మాత్రం దాని దరిదాపుల్లోకి వెళ్లలేదన్నది నిజం. హిందీలో ఎలాంటి పోటీ లేకపోయినా పీఎస్ 2ని అక్కడి జనాలు లైట్ తీసుకున్నారు. ఎమోషన్ డ్రామా ఎక్కువైపోయి ఎలివేషన్లు తగ్గడంతో ఇందులో యూనివర్శల్ అప్పీల్ తగ్గిపోయింది. లేకపోతే రిజల్ట్ ఇంకోలా ఉండేది