అఖిల్‌‌కు మైనస్.. వారికి ప్లస్

మంచి అంచనాలున్న ఒక సినిమా రిలీజవుతుంటే.. పోటీలో ఉన్న మిగతా సినిమాలు కొంచెం కంగారు పడతాయి. దానికి మంచి టాక్ వస్తే.. తమ పని అయిపోతుందని ఆ చిత్రాల మేకర్స్ భావిస్తారు. అదే సమయంలో ఆ పేరున్న సినిమాకు టాక్ తేడా కొడితే వీరికి కలిసి వస్తుంది. ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఏజెంట్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురయ్యేసరికి బాక్సాఫీస్ బరిలో ఉన్న మిగతా చిత్రాలకు బాగానే కలిసొచ్చేలా ఉంది. దీంతో పాటుగా శుక్రవారం అనువాద చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ రిలీజైంది. తెలుగులో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు కావడంతో రిలీజ్ పెద్దగానే చేశారు.

‘పొన్నియన్ సెల్వన్-1’ తెలుగులో సరిగా ఆడకపోయినా దిల్ రాజు తగ్గలేదు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే రెండో భాగానికి బెటర్ టాక్ వచ్చింది. ‘ఏజెంట్’ వీకెండ్లోనే చాలా కష్టంగా అడుగులు వేసేలా కనిపిస్తుండటం ‘పొన్నియన్ సెల్వన్-2’కు బాగా కలిసొచ్చే విషయమే. దీనికి కచ్చితంగా వసూళ్లు మెరుగుపడబోతున్నాయి.

ఇక ‘ఏజెంట్’ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుండటం వల్ల ‘పీఎస్-2’ కంటే కూడా ఎక్కువ లాభ పడేది ‘విరూపాక్ష’ సినిమానే. సాయిధరమ్ తేజ్ హీరోగా గత వారం విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టింది. ఆ చిత్రానికి వీకెండ్ తర్వాత కూడా నిలకడగా వసూళ్లు వచ్చాయి. ఐతే రెండో వీకెండ్లో పోటీని తట్టుకుని నిలబడుతుందా అన్న సందేహాలు తలెత్తాయి కానీ.. ‘ఏజెంట్’ తొలి రోజు సాయంత్రానికే పడుకుండిపోవడం ‘విరూపాక్ష’కు బాగా ప్లస్ అయింది. శుక్రవారం కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. శని, ఆదివారాల్లో హౌస్ ఫుల్స్‌తో రన్ అయితే ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంకో వారం పాటు ఆ చిత్రానికి ఢోకా లేనట్లే.

వచ్చే వారం రిలీజయ్యే ‘రామబాణం’, ‘ఉగ్రం’ చిత్రాల ఫలితాలను బట్టి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎంత వరకు సాగుతుందన్నది తేలుతుంది. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చి తేజు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ దిశగా అడుగులు వేస్తున్నాడు.