తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితే అంతే..


ప‌ది రోజుల కింద‌టే శాకుంత‌లం అనే భారీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పెద్ద బ‌డ్జెట్ పెట్టి ఎంతో శ్ర‌మ‌కోర్చి తీసిన సినిమా ఇది. కానీ ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ వ‌చ్చింది. ఆ టాక్ అంత‌కంత‌కూ పెరిగిందే త‌ప్ప త‌గ్గ‌లేదు. అంతే.. సినిమాకు ఓపెనింగ్స్ కూడా క‌ర‌వైపోయాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రీ దారుణ‌మైన ఫ‌లితాన్నందుకుందా చిత్రం. వీకెండ్లోనే ప్ర‌భావం చూపించ‌లేక చ‌తికిల‌ప‌డింది.

టాక్ తేడా వ‌స్తే ప‌రిస్థితి అంత దారుణంగా ఉంటోంది ఈ రోజుల్లో. అదే స‌మ‌యంలో టాక్ బాగుండి, మంచి సినిమా అనే పేరొస్తే.. థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెడ‌తారు తెలుగు ప్రేక్ష‌కులు. ముందు బ‌జ్ లేకున్నా స‌రే.. పాజిటివ్ టాక్ వ‌స్తే నెత్తిన పెట్టుకుంటారు. ఇది చూడాల్సిన సినిమా అనే ఫీలింగ్ క‌లిగిస్తే చాలు.. ఆద‌ర‌ణ ఊహించ‌ని స్థాయిలో ఉంటుంది. అందుకు గ‌త శుక్ర‌వారం రిలీజైన విరూపాక్ష చిత్ర‌మే ఉదాహ‌ర‌ణ‌.

ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నా స‌రే.. సాయిధ‌ర‌మ్ తేజ్ ట్రాక్ రికార్డు బాలేక‌పోవ‌డం, కొన్ని వారాలుగా బాక్సాఫీస్ స్లంప్‌లో ఉండ‌టం, ఇత‌ర కార‌ణాల‌తో ప్రి రిలీజ్ బ‌జ్ పెద్ద‌గా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మ‌రీ డ‌ల్లుగా ఉన్నాయి. కానీ సినిమాకు తొలి రోజు ఉద‌యం ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేస‌రికి మొత్తం క‌థ మారిపోయింది. సాయంత్రానికి ఫుల్స్ ప‌డిపోయాయి. శ‌ని, ఆదివారాల్లో ప్రేక్ష‌కులు ఈ సినిమాను విర‌గ‌బ‌డి చూశారు. సినిమా రేంజికి మించి వ‌సూళ్లు వ‌చ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్‌లో సైతం విరూపాక్ష వీకెండ్లో వ‌సూళ్ల మోత మోగించింది. సోమ‌వారం వ‌సూళ్ల‌లో కొంచెం డ్రాప్ క‌నిపించింది కానీ.. అయినా స‌రే బాగానే పెర్ఫామ్ చేస్తోంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితే ఆద‌ర‌ణ ఎలా ఉంటుంద‌న‌డానికి విరూపాక్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. మంచి కంటెంట్ ఇస్తే మ‌న ఆడియ‌న్స్ సినిమాను నెత్తిన పెట్టుకుంటార‌ని మ‌రోసారి రుజువైంది.